నిస్సాన్ కంపెనీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి 20 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

నిస్సాన్ కంపెనీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి 20 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

ఇండియా, చైనా మార్కెట్లలో లోకల్ కంపెనీలతో పోటీ పడలేక ఢీలా పడిన మల్టీ నేషనల్ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఈ జపాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అంటే కంపెనీ ఉద్యోగుల్లో 15 శాతం మంది ఎంప్లాయ్స్ ను తొలగించనుంది. సంవత్సరాల తరబడి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది షాకింగ్ న్యూస్  అనే చెప్పాలి. 

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 7 మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను కూడా క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. నిసాన్ కు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 17 తయారీ కేంద్రాలు ఉండగా.. వాటిని 10 కి తగ్గించాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.38 వేల 385 కోట్ల (4.5 బిలియన్ యూఎస్ డాలర్లు ) నష్టం వాటిల్లడంతో కాస్ట్ కటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనికి ముఖ్య కారణం చైనాలో వాహనాల అమ్మకం పూర్తిగా పడిపోవడమేనని తెలిపింది. దీనితో పాటు ఆటో దిగుమతులపై ట్రంప్ టారిఫ్ ల ప్రభావం కూడా పడినట్లు తెలిపింది. 

కంపెనీ రికవరీ ప్లాన్ లో భాగంగానే ఖర్చును తగ్గించి ప్రొడక్టివిటీ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా మార్కెట్ లో వస్తున్న మార్పులకు  అనుగుణంగా.. పోటీని తట్టుకునేలా కొత్త వ్యూహాలతో మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ఈ నిర్ణయం తప్పడం లేదని ప్రకటించింది. 

అదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 14 వేల 510 కోట్లు ఖర్చను తగ్గించుకునే ప్లాన్ లో ఉంది కంపెనీ. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జెరెమియీ పపిన్ మాట్లాడుతూ.. ‘‘కంపెనీ మళ్లీ టర్న్ అరౌండ్ కావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. కానీ కంపెనీ దగ్గర ఉన్న ఆర్థిక వనరులతో మళ్లీ పుంజుకుంటాం’’ అని తెలిపారు. 

యూఎస్ టారిఫ్ తో నిస్సాన్ పై 25 శాతం దిగుమతి సుంకం పడనుంది. దీంతో దిగుమతి దారులు, ఫ్రాంఛేజీలకు ఇది భారంగా మారనుంది. అయితే పెరగనున్న కాస్ట్ ను కస్టమర్లకు పాస్ ఆన్ చేయలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు, కంపెనీ యూనిట్ల మూసివేత అని తెలిపారు.

నిస్సాన్ జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ. చైనా మార్కెట్లో డిమాండ్ తగ్గడం, వివిధ దేశాలలో స్థానికంగా ఉన్న బ్రాండ్లతో నష్టాలను చవిచూస్తూ వస్తోంది. అయితే నష్టాల నుంచి కోలుకోవడానికి ప్రముఖ్ హోండా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ఆ మధ్య చర్చలు జరిగాయి. దాదాపు కలిసిపోయాయి  అనే వరకు వచ్చింది. కానీ.. తమ కంపెనీకి సబ్సిడరీ కంపెనీగా ఉంటేనే అంగీకరిస్తామని హోండా షరతు విధించడంతో ఈ డీల్ రద్దయ్యింది. అయితే ఇతర కంపెనీలతో పార్టనర్ షిప్ కోసం తమ తలుపులు తెరిచే ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.