- కేర్‌టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో నైపుణ్యానికి పదును
- కార్మిక, పర్యాటక శాఖల సంయుక్త కార్యాచరణ
- ఒక్కో బ్యాచ్‌లో200 మంది యువతకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశీ కొలువులకే పరిమితం కాకుండా ఖండాంతరాల్లోని అవకాశాలను కూడా అందిపుచ్చుకునేలా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా జపాన్, జర్మనీ వంటి దేశాల్లో పెరుగుతున్న ‘హోంకేర్’ (వృద్ధుల సంరక్షణ), కేర్ టేకర్, హాస్పిటాలిటీ (ఆతిథ్యరంగం) అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథమ్) వేదికగా శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. వృత్తివిద్యా కోర్సులే కాకుండా ఆయా దేశాల భాషలపై పట్టు సాధించేలా మూడు నెలల పాటు క్రాష్ కోర్సులను నిర్వహించనుంది.
ఈ మేరకు కార్మిక, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని నిథమ్ క్యాంపస్‌లో శిక్షణ నిర్వహించనున్నారు. అయితే, చాలా మంది యువతకు నైపుణ్యం ఉన్నప్పటికీ భాషా సమస్యతో విదేశాల్లో ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం.. జపాన్, జర్మనీ దేశాల్లోని భాషలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలపాటు సాగే ఈ కోర్సులో భాషతోపాటు ఆయా దేశాల సంస్కృతి, పని వాతావరణంపై అవగాహన కల్పించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 200 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు.
ప్లేస్‌మెంట్స్ దక్కేలా ఒప్పందాలు
జపాన్, జర్మనీ వంటి దేశాల్లో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండడంతో వారి సంరక్షణకు నిపుణుల అవసరం ఏర్పడింది. హోంకేర్, కేర్ టేకర్‌తోపాటు పర్యాటక రంగంలో హోటల్ మేనేజ్ మెంట్ నిపుణులకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే నిథమ్‌లో ఇచ్చే శిక్షణ ఈ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించనున్నది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నేరుగా ఆయా దేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం ముందే ఒప్పందాలు కుదుర్చుకుంది. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఇప్పటికే జపాన్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలను అధ్యయనం చేశారు.
అక్కడి ప్రముఖ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, కంపెనీలతో చర్చలు జరిపారు. అక్కడి కంపెనీల అవసరాలకు అనుగుణంగానే ఇక్కడ సిలబస్ రూపొందించనున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు ప్లేస్‌మెంట్స్ కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోనుంది.
కార్మిక, టూరిజం శాఖల సమన్వయంతో
నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ వేతనాలు, జీవన ప్రమాణాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కార్మిక, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిథమ్ క్యాంపస్‌లో శిక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ కాలంలో భోజనంతోపాటు వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే విదేశీలకు వెళ్లేందుకు కావాల్సిన వీసా ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వమే చూసుకుంటోంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అభ్యర్థులు మోసపోయే అవకాశం ఉండదని యువత పేర్కొంటున్నారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ,
దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే చాన్స్ ఉంది.
జపాన్, జర్మనీ దేశాల్లో ఉపాధి అవకాశాలు
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జపాన్, జర్మనీ దేశాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లోనూ వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ పనిచేసే యువత కొరత ఏర్పడింది. దీంతో విదేశీ నిపుణులకు భారీగా అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీగా అవకాశాలు ఉన్నాయి.
అయితే వృద్ధుల సంరక్షణ, తయారీ రంగం, ఐటీ, రోబోటిక్స్, హోటల్, హాస్పిటాలిటీ రంగాల్లో నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. జర్మనీలో ఏటా దాదాపు 4 లక్షల మంది కొత్త కార్మికుల అవసరం ఉంది. ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే జర్మనీలో వేతనాలు, సామాజిక భద్రత మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

