నీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

 నీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి అయోగ్ స్పందించింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో  నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు నీతి ఆయోగ్ అనేక చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. గత ఏడాది నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్/ సభ్యులు వివిధ రాష్ట్రాల సీఎంలతో 30కి పైగా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని చెప్పింది. తమ అభ్యర్థనలు పెడచెవిన పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్‌తో సమావేశం నిర్వహించలేదని తెలిపింది.

కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

జాతీయ ప్రాముఖ్యత కలిగిన అన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయం ,రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో  చర్చిస్తోందని నీతి ఆయోగ్ .ఆగస్ట్ 7వ తేదీ 2022 పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా, తెలంగాణతో సహా కేంద్రం, రాష్ట్రాల మధ్య వివరణాత్మక సంప్రదింపులు జరిగాయని తెలిపింది. 2022 జూన్ లో ధర్మశాలలో మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు పాల్గొని చర్చించారు.ఎజెండా తయారీలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారన్నారు.

ఆర్థిక సహకారంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం

జల్ జీవన్ మిషన్ కింద గత 4 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయించింది. అయితే రాష్ట్రం కేవలం రూ.200 కోట్లు వినియోగించుకోవాలని నిర్ణయించుకుందన్నారు. అంతేగాక 2014 నుంచి -2022 మధ్య కాలంలో తెలంగాణకు PMKSY-,AIBP, CADWM కింద రూ.1195 కోట్లు విడుదలయ్యాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రతిష్టాత్మక పథకాలు సహా ఆర్థిక విషయాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిరంతరం సహకరిస్తోందని తెలిపింది.

రాష్ట్రాలకు కేటాయింపులు 32 నుంచి 42 శాతానికి పెంపు

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులు 2015- 16లో రూ. 2,03,740 కోట్లు ఉంటే 2022--23లో రూ. 4,42,781 కోట్లుగా ఉంది. అంటే కేటాయింపులు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల కేటాయింపులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. CSS కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగిన వెసులుబాటు కల్పించింది.ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని, నిరాధార ఆరోపణలతో సమస్యలను రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని తెలిపింది. గవర్నింగ్ కౌన్సిల్ అనేది టీమ్ ఇండియా అత్యున్నత స్థాయిలో చర్చించి, దేశాభివృద్ధికి సత్ఫలితాలిచ్చే పరిష్కారాలను సూచించే వేదిక అన్నారు.