తెలంగాణలోని జాతీయ రహదారి 930పీ విస్తరణకు రూ.675 కోట్లు 

తెలంగాణలోని జాతీయ రహదారి 930పీ విస్తరణకు రూ.675 కోట్లు 

తెలంగాణకు 675 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును  కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రకటించారు. జాతీయ రహదారి 930పీలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ నుంచి నెహ్రూ నగర్ వరకు ఉన్న రెండు లేన్ల రహదారిని విస్తరించనున్నట్లు చెప్పారు.ఇది హైదరాబాద్ - మహబూబాబాద్ -  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతుందని వివరించారు. ప్రతిపాదిత జాతీయ రహదారి వల్ల హైదరాబాద్ -భద్రాచలం మధ్య 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్​ జిల్లాలోని బయ్యారం మండలాల్లో రవాణా సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు వివరాలతో ఆయన ట్వీట్​ చేశారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కృష్ణానదిపై ఐకానిక్​ వంతెన నిర్మాణం కానుంది. దీని నిర్మాణంతో ఏపీ, తెలంగాణ మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. రూ.1,082.65 కోట్లతో ఈ వంతెన నిర్మాణ ప్రణాళికకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా రూ.436 కోట్లను మంజూరు చేసింది. ఈవిషయాన్ని ట్వీట్​ లో నితిన్​ గడ్కరీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఏపీలోని నంద్యాల జిల్లాలో వరద ముంపు బాధిత గ్రామాల ప్రజల సౌకర్యార్ధం కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మించనున్నారు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం, తెలంగాణలోని నాగర్​ కర్నూల్​ జిల్లా సోమశిల మద్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్​ వెళ్లాలంటే... కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాలి. ఈ వంతెన నిర్మాణం జరిగితే నేరుగా నాగర్​ కర్నూలు మీదుగా హైదరాబాద్​ వెళ్లిపోవచ్చు. తెలంగాణ నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి.