బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్

న్యూఢిల్లీ: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం (డిసెంబర్ 15) ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత నితిన్ నబిన్‏కు ఘన స్వాగతం లభించింది. 

అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సహా వివిధ నాయకులు ఆయనకు గ్రాండ్ వెల్‎కమ్ చెప్పారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నాయకులు,  కార్యకర్తలను ఉద్దేశించి నబిన్ మాట్లాడుతూ.. నాలాంటి చిన్న కార్యకర్తకు పార్టీ చాలా పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. కార్యకర్తల నిబద్ధత, కృషిని పార్టీ గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శమని చెప్పారు.

నితిన్ నబీన్ బ్యాగ్రౌండ్:

దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన.. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్‎ను నిలబెట్టింది. అప్పటి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నబిన్ బీహార్ ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యుడీ) మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా నితిన్ నబిన్‎ను నియమించింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయనకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.