సీఎం పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో 20 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో కొనసాగిన లెగసీకి ఫుల్ స్టాప్ పెట్టారు నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో లాలూ తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయిన లీడర్ నితీష్ కుమార్. 20 ఏళ్లు బీహార్ సీఎంగా ఉన్నారు. 2005లో బీహార్ సీఎం పీఠంపై కూర్చున్న నితీష్.. ఇప్పటి వరకు ఎదురులేకుండా కొనసాగారు. తన పార్టీ జనతాదళ్ గెలిచే సీట్లు ఎన్నయినా సరే.. పొత్తులో భాగంగా సీఎం కావటం నితీష్ కుమార్ ప్రత్యేకత.
తన రాజకీయ జీవితం మొత్తంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా 1985లో.. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్సీగానే ఎన్నికవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని.. తన పొత్తులో ఉన్న బీజేపీని గెలిపించిన నితీష్ కుమార్.. బీహార్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. ఆ క్రమంలోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నిక అయ్యారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే.. 2026, ఏప్రిల్ 14వ తేదీన బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
బీహార్ కొత్త సీఎం ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. నితీష్ వారసుడిగా ఎవర్ని సీఎంగా ఎంపిక చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే బీహార్ కొత్త సీఎంగా క్లారిటీకి వచ్చిన బీజేపీ, జనతాదళ్ పార్టీలు.. మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రకటించనున్నాయి.

