బీహార్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

బీహార్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. 

శరవేగంగా మారిన పరిణామాలు
మంగళవారం బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. ఆ వెంటనే పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి వెళ్లి తేజస్వీ యాదవ్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి రావాలని కోరారు. అందుకు తేజస్వీ అంగీకరించడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా మొత్తం 7 పార్టీలతో కలిసి ‘మహా ఘట్ బంధన్‌‌’ ఏర్పాటు చేశారు. గవర్నర్‌‌‌‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తనకుందని 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేశారు. గవర్నర్ అంగీకరించడంతో బీహార్లో కొత్త సర్కారు ఏర్పాటైంది. కేబినెట్‌‌లో జేడీయూ, ఆర్జేడీలకు చెరో 14 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి మూడు లేదా నాలుగు బెర్తులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. 

పార్టీల బలాబలాలివీ
బీహార్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ.  ఆ పార్టీకి 79 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు.  బీజేపీకి 77,  జేడీయూకి 45(+ ఒక ఇండిపెండెంట్), కాంగ్రెస్‌‌కు 19,  సీపీఐఎంఎల్‌‌కు 12,  సీపీఐ 2, సీపీఎం 2, హెచ్‌‌ఏఎంకి నాలుగు సీట్లు ఉన్నాయి. ఎంఐఎంకు ఒక సీటు ఉంది. ప్రస్తుతం ఒక సీటులో ఖాళీగా ఉంది. ప్రస్తుతం శాసన సభ్యుల సంఖ్య 242 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122.  నితీశ్ నేతృత్వంలో ఏర్పడిన మహా ఘట్ బంధన్ లో164 మంది ఎమ్మెల్యేలున్నారు.

22 ఏండ్లలో 8వ సారి
రెండు దశాబ్దాల వ్యవధిలో నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. 2000 మార్చిలో నితీశ్​ తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు.  ఆ తర్వాత2005 నవంబర్‌‌‌లో, 2010 నవంబర్‌‌‌‌, 2015 ఫిబ్రవరి, 2015 నవంబర్‌‌‌‌, 2017 జులై, 2020 నవంబర్‌లలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 8 ఏండ్ల వ్యవధిలో నితీశ్ 4 సార్లు సీఎంగా  ప్రమాణం చేయడం విశేషం.