సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైన నితీశ్ కుమార్ గవర్నర్ ను కలిసి తన నిర్ణయం వెల్లడించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం మేరకు ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్ ను కలిసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ రాజ్ భవన్ నుంచి రబ్రీ దేవి నివాసానికి బయలుదేరారు. 

ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్ కొత్త సర్కారు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 160 మంది ఎమ్మెల్యేల  మద్దతు ఉండటంతో సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. సాయంత్రం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో కలిసి నితీశ్ మరోసారి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. 

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం. నితీశ్ నేతృత్వంలోని జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీకి 79, ఇతరులు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  మొత్తం 160 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను నితీశ్, తేజస్వీలు సాయంత్రం గవర్నర్ కు అందజేయనున్నట్లు సమాచారం.