ఎమ్మెల్యేలు, ఎంపీలతో రేపు నితీశ్ భేటీ..

ఎమ్మెల్యేలు, ఎంపీలతో రేపు నితీశ్ భేటీ..

బీహార్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. అకస్మాత్తుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బీహార్ సీఎం  నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ కలిసి ఏర్పాటుచేసిన సంకీర్ణ సర్కారులో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే ప్రచారం వేడెక్కింది. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ సమావేశానికి సీఎం నితీశ్ గైర్హాజరు కావడంతో ఈ సందేహాలు రెక్కలు తొడిగాయి. జాతీయ మీడియాలో ప్రధాన వార్తాంశంగా మారాయి. జులై 17 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం నాలుగు ముఖ్య సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ మధ్య అగాధం ఏర్పడటం వల్లే నితీశ్ ఈవిధంగా దూరాన్ని పాటిస్తున్నారనే విశ్లేషణలు వెలువడ్డాయి.

ఈ తరుణంలో సీఎం నితీశ్ మరో కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 9న తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశానికి ఆయన పిలుపునివ్వడం బీహార్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. బీజేపీతో పొత్తును కొనసాగించాలా ?  వద్దా ? అనే దానిపై ఈ భేటీ తర్వాత నితీశ్ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎన్డీయే కూటమి నుంచి నితీశ్ బయటికి వస్తే.. లాలూ ప్రసాద్ రాజకీయ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ ఉందని పరిశీలకులు అంటున్నారు. బీహార్ ఎన్డీయే కూటమిలో లుకలుకలు ఈ స్థాయికి చేరడానికి దారితీసిన ముఖ్య ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 
రాంచంద్ర ప్రసాద్ సింగ్ రాజీనామా

జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాంచంద్ర ప్రసాద్ సింగ్ ఆగస్టు 6న పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రాంచంద్ర ప్రసాద్ సింగ్ ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు నితీశ్ నిరాకరించడమే రాజీనామాకు ప్రధాన కారణం. గత తొమ్మిదేళ్లలో కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేసిన స్థిరాస్తుల సమాచారాన్ని ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడి హోదాలో నితీశ్ కుమార్ ఆదేశించడంతో అలిగిన రాంచంద్ర ప్రసాద్.. వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనేపథ్యంలో తమ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని జనతాదళ్ (యునైటెడ్) నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు

బీహార్లో తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి అసెంబ్లీ స్పీకర్ పోస్టును నితీశ్ కుమార్ కేటాయించారు. దీంతో ఆ పదవిని బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ సిన్హా పొందారు. అసెంబ్లీలో విజయ్ కుమార్ సిన్హా తమ మాట వినకుండా ప్రవర్తిస్తున్నారనే భావనలో నితీశ్ ఉన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చొని తమ ప్రభుత్వాన్ని విమర్శించేలా విజయ్ కుమార్ వ్యా్ఖ్యలు చేస్తున్నారని నితీశ్ కుమార్ పలుమార్లు మీడియా ఎదుటే చెప్పారు. 

పదవుల కేటాయింపులో మొండిచేయి

2019లో కేంద్ర ప్రభుత్వంలో నితీశ్ పార్టీ జేడీ(యూ) నుంచి ఒక ఎంపీకే మంత్రి పదవిని కేటాయించారు. దానిపై నాటి నుంచే నితీశ్ అసంతృప్తిగా  ఉన్నారు. కేంద్రంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కేంద్రంలో జేడీ(యూ)  మంత్రి పదవులు తీసుకోబోదని జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్  ఇటీవల స్పష్టం చేయడం గమనార్హం. ఈనేపథ్యంలో తాజాగా బీహార్ క్యాబినెట్ విస్తరణలో తన పార్టీకి చెందిన 8 మందికి మంత్రి పదవులు కేటాయించిన నితీశ్.. బీజేపీకి ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. 

అగ్నిపథ్ పై మౌనం

అగ్నిపథ్ స్కీంపై నిరుద్యోగుల ఆందోళనలు పెల్లుబికిన సందర్భంలోనూ నితీశ్ కుమార్ పార్టీ మౌనం వహించింది. ఆందోళనకారులతో చర్చలు జరపాలని కేంద్రానికి జేడీ(యూ) నేతలు అప్పట్లో సూచించారు. కానీ అగ్నిపథ్ స్కీం ను నేరుగా ఎన్నడూ సమర్ధించలేదు. సీఎం హోదాలో ఉన్న నితీశ్ మౌనం వహించడం వల్లే అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బీహార్ లో ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయనే టాక్ వచ్చింది. 

జమిలిపై వ్యతిరేకత

జమిలి ఎన్నికల కాన్సెప్ట్ తో బీజేపీ ముందుకు పోతోంది. దేశంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో నిర్వహించాలనే ఆలోచనతో ఎన్డీయే సర్కారు ఉంది. దీన్ని మొదటి నుంచీ నితీశ్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. అలా జరిగితే తాము నష్టపోతామనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.