ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ సర్కారు..?

ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ సర్కారు..?

బీహార్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిన సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం పొత్తులో భాగంగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనుండగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖ బాద్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

బీజేపీ జేడీయూ నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నితీశ్ ఇవాళ జరిగిన భేటీలో చెప్పినట్లు సమాచారం. 2020 నుంచి కమలనాథులు ఆ ప్రయత్నంలో ఉన్నట్లు వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అప్రమత్తం కాని పక్షంలో అది పార్టీ భవిష్యత్తుకు మంచిదికాదని వారంతా తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న అనంతరం నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే నితీశ్ కుమార్ కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బీజేపీ రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని ఆయన ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు.