Bihar Caste survey : బీహార్ లో ఓసీలు 16 శాతమే.. సర్వేలో సంచలన విషయాలు

Bihar Caste survey : బీహార్ లో ఓసీలు 16 శాతమే.. సర్వేలో సంచలన విషయాలు

Bihar Caste survey : బీహార్‌లో కులగణన సర్వే నివేదికను నితీష్ సర్కార్ విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతం ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ఈ రిపోర్టును బీహార్ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ సోమవారం (అక్టోబర్ 2న) విడుదల చేశారు.

తాజా నివేదిక ప్రకారం.. బీహార్‌ రాష్ట్ర జనాభా దాదాపు 13 కోట్ల 7 లక్షలు (13.07 కోట్లు). వీరిలో అత్యంత వెనుబడిన తరగతుల వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల వారు 27.13 శాతంగా ఉన్నారు.

కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల (SCs) జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్‌ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది.

ALSO READ : సలార్ రాకతో.. బడా సినిమాలకు పోటీగా సైంధవ్‌..?

రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో కులగణన ప్రక్రియ పూర్తి చేశారు. 2023, జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం తెలపడంతో బీహార్ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టింది నితీష్ సర్కార్. 

కులగణను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ కులగణన సర్వేకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.

కులగణన నివేదిక నేపథ్యంలో అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం నీతీశ్‌ కుమార్‌ సోమవారం (అక్టోబర్ 2న) ఉదయం మీడియాతో చెప్పారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అన్ని అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు.