2025 డిసెంబర్​లోపు..నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం

2025 డిసెంబర్​లోపు..నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం
  • మెరుగైన వంగడాలతో చెరుకు రైతులకు ప్రోత్సాహం : మంత్రి శ్రీధర్ బాబు
  • గత సర్కారు నిర్లక్ష్యం వల్లే ఫ్యాక్టరీలకు ఈ దుస్థితి అని కామెంట్​
  • ముత్యంపేట ఫ్యాక్టరీ పరిశీలన.. యాజమాన్యంతో చర్చలు

జగిత్యాల/మల్లాపూర్, వెలుగు : ఆరు నూరైనా 2025 డిసెంబర్ లోగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ రీ-ఓపెనింగ్ సిఫార్సుల కమిటీ చైర్మన్ హోదాలో మంత్రి శ్రీధర్ బాబు.. కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ లోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని బుధవారం పరిశీలించారు. అంతకుముందు జగిత్యాల ఎంసీహెచ్ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లోని ప్రధాన అంశమన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచనలతోనే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నిజాం షుగర్స్ అంశాన్ని చేర్చామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి,  రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలిపారు. గత సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఫ్యాక్టరీలకు ఈ దుస్థితి పట్టిందని శ్రీధర్​బాబు ఫైర్ అయ్యారు.

ఫ్యాక్టరీల యాజమాన్యం ఎన్ని సార్లు సర్కారు దృష్టికి తీసుకువెళ్లినా అప్పటి సీఎం కేసీఆర్  పట్టించుకోలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీల ఆస్తులపై వివిధ బ్యాంకులలో రూ.190 కోట్ల అప్పులు ఉన్నాయని, వాటి చెల్లింపుపై కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలోగానీ, ప్రైవేట్​రంగంలోగానీ చెరుకు ఫ్యాక్టరీలను ప్రారంభించేందుకు కృషిచేస్తామని.. ఇందుకు స్థానిక రైతులు సహకరించాలని మంత్రి కోరారు. చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల కోసం రైతులు, ఆఫీసర్లతో కలిసి ముత్యంపేట ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపామని చెప్పారు. 

15 వేల ఎకరాల్లో చెరుకు సాగుచేయాలి.. 

ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ఈ ప్రాంతంలో సుమారు15 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేయాల్సి ఉంటుందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ అయితేనే ఫ్యాక్టరీకి, రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇథనాల్, మొలాసిస్ తో పాటు చెరుకు వ్యర్థాలతో తయారయ్యే పరిశ్రమలను అనుబంధంగా నెలకొల్పితే ఫ్యాక్టరీకి 150 ఏండ్ల దాకా ఢోకా ఉండదన్నారు. శాస్త్రీయ వంగడాలు అందించి, చెరుకు రైతులను ప్రోత్సహించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఫ్యాక్టరీ వద్దకు ప్రభుత్వ పీఎస్, రాష్ట్ర షుగర్ కేన్ సెక్రటరీ వచ్చి స్థానిక ప్రజా ప్రతినిధులతో మీటింగ్ పెట్టి పురోగతిపై చర్చిస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు జయేశ్ రంజన్, మన్సూర్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యేలు అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శీను, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నేతలు జువ్వాడి నర్సింగారావు, కల్వకుంట్ల సుజిత్ రావు, కొమిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.