నిజాం షుగర్స్​పై నివేదిక ఇవ్వండి

నిజాం షుగర్స్​పై నివేదిక ఇవ్వండి
  • వీలైనంత త్వరగా అందజేయాలని కేబినెట్​ సబ్ కమిటీకి సీఎం సూచన 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీ సమావేశం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా పరిశీలించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని కమిటీకి సీఎం సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా మరోసారి సమావేశం అవుదామని సీఎం అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని బీఆర్ఎస్ పార్టీ​(అప్పటి టీఆర్ఎస్​) 2014లోనే హామీ ఇచ్చింది.  ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగుతున్న పరిశ్రమను సహకార సంఘంగా కొనసాగించాలని 2015లో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యాక్టరీ ఆర్థికంగా లాభదాయకంగా లేనందున ప్రభుత్వం దానిని నడపలేదని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో తేల్చిచెప్పారు. దీంతో 2017లో ప్రైవేట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించింది. ఈ పరిణామం మూడు యూనిట్ల మూసివేతకు దారితీసింది.