బీహార్ లో కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు

బీహార్ లో కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు

రాష్ట్రాన్ని ఉద్ధరించలేని సీఎం కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీహార్ లో కేసీఆర్ తెలంగాణ పరువు తీశారంటూ మండిపడ్డారు. కోవిడ్ సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడిన గొప్ప మహిళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ వివరాలు అడిగితే తప్పేముందన్నారు. జిల్లా కలెక్టర్ సరైన వివరాలు చెబితే తమ బండారం బయటపడుతుందనే భయం టీఆర్ఎస్ నేతలకు పట్టుకుందన్నారు. ఒక మహిళా మంత్రి, తెలంగాణ కోడలిపై టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. 

మంత్రులపై ఆగ్రహం
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు కేంద్రంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ మంత్రి అని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన హామీలను పూర్తి చేయించే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డిదే అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను గంగిరెద్దుల తల ఊపి విన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఇప్పుడు జిల్లా ప్రజలకు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సీఎం కేసీఆర్ పెద్ద జోకర్.. ఆయన పార్టీ నేతలంతా ఆయన వారసులు’ అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ మత్తులో తూగుతున్నారని ఆరోపించారు. 

ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..
ఎన్నికల ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తాను పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి.. స్పైస్ బోర్డు తెచ్చానని, రూ.30 కోట్ల నిధులు కూడా తీసుకొచ్చానని ఎంపీ అర్వింద్ చెప్పారు. పసుపుకు అధిక ధర కూడా రైతులకు వచ్చేలా చేశానని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తేరుస్తానని హామీ ఇచ్చి జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్య, పోడు భూములు ఉన్న వారికి పట్టాలు ఇస్తానన్న వాగ్దానాలను.. కేసీఆర్ గాలికి వదిలేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు పిచ్చి ముదిరినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలను గెలుస్తామన్నారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేరిందన్నారు. కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరి ఉంటే చాలామంది ప్రాణాలు పోయేవి కావన్నారు.