మిడతల దండు నుంచి రైతులు త‌మ‌ పంటలను కాపాడుకోవాలి

మిడతల దండు నుంచి రైతులు త‌మ‌ పంటలను కాపాడుకోవాలి

నిజామాబాద్ జిల్లా: వ్య‌వ‌సాయ శాఖ సూచ‌న‌లు పాటిస్తూ మిడతల దండు నుంచి రైతులు త‌మ‌ పంటలను కాపాడుకోవాలని చెప్పారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్ర లోని వార్ధా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని, మ‌హారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు‌
ప్రత్యేక వాతావరణ పరిస్థితులలో మిడతలు విజృంభిస్తూ గంటకు 5 నుండి 130 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు పయనిస్తాయని , దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి తింటాయ‌ని, కాబ‌ట్టి రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాల‌న్నారు. మిడతల దండు పంటలపై దాడి చేస్తే పంటలకు తీవ్ర నష్టం జ‌రిగే అవకాశం ఉంద‌ని, రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ.. పంటలను కాపాడుకోవాల‌ని సూచించారు

వ్యవసాయ శాఖ సూచించిన సమగ్ర మిడతల యాజమాన్య చర్యలు:

1. మిడతలను పరిసర ప్రాంతాలలో గమనించినట్లైతే తమ పంటలలోకి రాకుండా డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో లేదా లౌడ్ స్పీకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో శబ్దం చేసి పంటలను రక్షించుకోవచ్చు.
2. వేప రసాయనాల (0.15% EC) ను 15 లీటర్ల నీటికి 45 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
3. క్వినోల్ ఫాస్ 1.5 % DP లేదా క్లోరోపైరోఫాస్ 1.5 % DP పొడి మందులను హెక్టరుకు25 కేజీల చొప్పున పంటలపై చల్లాలి.
4. సాగు చేయబడిన పొలాలలో మిడతల గుడ్ల దశను గమనించిన ట్లయితే క్వినోల్ ఫాస్ 1.5 % DP లేదా క్లోరోపైరోఫాస్ 1.5 % DP పొడి మందులను హెక్టరుకు25 కేజీల చొప్పున చల్లి, పొలాన్ని దున్నినట్లైతే గుడ్లు, పిల్ల పురుగులు నాశనమవుతాయి.
5. ఎండిన పొలాల్లో లేదా చుట్టుపక్కల మంటలు వేస్తే మిడతల దండు లేదా పిల్ల దశ పురుగులు మంటల్లో పడి నాశనం అవుతాయి.

పై మార్గదర్శకాలు పాటించి రైతులు పంటలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Nizamabad district collector advises farmers to protect their crops from grasshoppers