
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో చేపట్టే చలో కలక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. శనివారం బీజేపీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమానికి సంబందించిన వాల్ పోస్టర్‌ను ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని ఉద్దేశంతో చలో కలెక్టరేట్‌ను పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం నగర అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశామని ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం మరో పక్క ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శు పోతాన్‌కార్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగొల్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, పంచారెడ్డి శ్రీధర్, బూర్గుల వినోద్, మండల అధ్యక్షుడు పుట్టా వీరేందర్, రోషన్ లాల్ పాల్గొన్నారు
కలెక్టర్‌ను కలిసిన రెడ్‌క్రాస్ ప్రతినిధులు
నిజామాబాద్, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు గ్రహీతలు కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు సి.నారాయణరెడ్డిని శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోటివేషనల్ కేటగిరిలో గోల్డ్ మెడల్ పొందిన జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, మెంబెర్ షిప్ డ్రైవ్‌లో గోల్డ్ మెడల్ పొందిన తోట రాజశేఖర్, డాక్టర్ నీలి రాంచందర్, డాక్టర్ కరిపె తేజస్వితో పాటు రెడ్ క్రాస్‌కు విరాళం అందచేసిన కేటగిరిలో గోల్డ్ మెడల్ పొందిన రెడ్డి అండ్ కో ఏలేటి రవిరెడ్డి, సిల్వర్ మెడల్ పొందిన కరిపె రవీందర్, విశిష్ట సేవలకుగాను జ్ఞాపికలు పొందిన డొల్ల రాజేశ్వర్, తోట రాజశేఖర్, బస్వేశ్వర్ రావు, డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ , మాణిక్యాల శ్రీనివాస్‌ను కలెక్టర్ అభినందించారు. ముందుముందు మరిన్ని ఉత్తమ సేవలు అందించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్ర మిశ్రా, డీఎంహెచ్‌వో సుదర్శనంను కూడా కలిశారు.
అంకాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తా : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, వెలుగు : మండలంలోని అంకాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం అంకాపూర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ చౌరస్తాను అభివృద్ధి చేస్తానని, సమీకృత వెజిటేబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేయిస్తానని, డబుల్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు పూర్తవుతున్నందున వచ్చే నెలలో గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీ మహేందర్, పీఆర్ ఏఈ నితీశ్, నాయకులు గంగారెడ్డి, నర్సారెడ్డి, భాజన్న, వీడీసీ పెద్దలు పాల్గొన్నారు.
క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ
ఆర్మూర్, వెలుగు: సిద్దిపేట్ జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హ్యాండ్ బాల్ పోటీలకు వెళుతున్న జిల్లా జట్టు క్రీడాకారులకు శనివారం స్పోర్ట్స్ డ్రెస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అడ్ హక్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్గంగా మోహన్ చక్రు, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ 51వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తా చాటాలని సూచించారు. జిల్లా హ్యాండ్ బాల్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ పింజ సురేందర్, కోకన్వీనర్ జి.రాజేశ్, అప్పాల గణేశ్, పీఈటీలు సురేశ్, రామ్ సింగ్, రాజేందర్, యాసిన్, జట్టు కోచ్ రాజేందర్ పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో రూ.5 లక్షలు నగదు.. 8 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని పెద్దబజార్‌లో శనివారం ఓ ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు రూ.5 లక్షలు నగదు, 8 తులాల బంగా రం, 21 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడి వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దినేశ్ తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి శుక్రవారం ఊరికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించిన దొంగలు తాళం పగులగొట్టారు. ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.5 లక్షలు నగదు, 8 తులాల బంగారం, 21 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చిన దినేశ్ చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దినేశ్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు సమీపంలోని రజక సంఘం తాళాలు పగులగొట్టి అందులో ఏమి దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌బాబు తెలిపారు.