కాంబోడియాలో నిజామాబాద్ వ్యక్తి మృతి.. డెడ్ బాడీని తెప్పించాలని కుటుంబీలకు ఆవేదన

కాంబోడియాలో నిజామాబాద్ వ్యక్తి మృతి.. డెడ్ బాడీని తెప్పించాలని కుటుంబీలకు ఆవేదన

ఆర్మూర్, వెలుగు: కాంబోడియా దేశానికి ఉపాధి కోసం వెళ్లి మూడు రోజుల కింద అనారోగ్యంతో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన సోరిపేట విజయ్‌కుమార్‌ (37) మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు. సోమవారం ఆర్మూర్‌కు వచ్చి ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు.

రెండున్నర  ఏండ్ల కింద ఉపాధి కోసం కాంబోడియా వెళ్లిన విజయ్ అక్కడి హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించి పచ్చకామెర్లు వ్యాధితో మృతి చెందాడన్నారు. విజిట్ వీసాతో పని చేస్తున్నందున మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలంటూ కుటుంబీకులు, నందిపేట బీజేపీ నాయకులు పెయింటర్ రాజు, పటేల్‌ రాజు, విజయ్‌కుమార్‌లతో కలిసి కోటపాటిని కలిశారు. 

కోటపాటి, కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీకి మెయిల్ ద్వారా సమాచారం అందించి, రవాణా చార్జీలు మంజూరు చేసి మృతదేహాన్ని త్వరగా భారత్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్న తమిళనాడు వాసి, సామాజిక సేవకుడు సయ్యద్ వాసీవ్‌తో సంప్రదించి ఎంబసీ అధికారులను కలిసి సహాయపడాల్సిందిగా కోరగా, ఆయన ఇందుకు అంగీకరించి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.