సమైక్య పాలకులు సన్నాసులైతే నువ్వేంటి

సమైక్య పాలకులు సన్నాసులైతే నువ్వేంటి
  • సీఎం కేసీఆర్‌‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధ్వజం

నిజామాబాద్, వెలుగు: ‘నీ కళ్ల ముందే టీఆర్ఎస్ పార్టీని బొందపెడతాం.. అది నువ్వు చూడాలి.. నిజామాబాద్‌‌లో నీ పార్టీకి పట్టిన గతే సిరిసిల్ల, గజ్వేల్‌‌లో కూడా పడుతుంది. తెలంగాణలో రానున్న రోజుల్లో టీఆర్‌‌ఎస్‌‌కు పట్టే దుర్గతిని చూసేందుకైనా కేసీఆర్ నిండానూరేళ్లు బతకాలని కోరుకుంటున్నా’ అని నిజామాబాద్‌‌ ఎంపీ అర్వింద్ అన్నారు.

తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిజామాబాద్‌‌ జిల్లా బీజేపీ ఆఫీస్‌‌లో పార్టీ జెండా ఎగరేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ తనను శపిస్తున్నారని, ఎక్కువ రోజులు బతకడని అంటున్నారని అన్నారు. తెలంగాణకు కేసీఆరే పెద్ద శాపమని, ఆయన్ను ఎవరెందుకు శపిస్తారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ విమోచన దినం జరపని సమైక్య పాలకులను సన్నాసులని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు తన పాలనలో ఎందుకు దాన్ని జరపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వేడుకలు అధికారికంగా జరిపేది లేదని అసెంబ్లీలో కరాకండిగా చెప్పిన తనను ఏమనాలో ఆయనే చెప్పాలన్నారు. నీ పాలనలో ఏం మంచి పనులు చేశావని ప్రజలు మూడు టర్మ్​లు అధికారం అప్పగిస్తారో చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ  జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బస్వా లక్ష్మినర్సయ్య, అమృత లతారెడ్డి, గజం ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.