నాలుగు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం : అర్వింద్

నాలుగు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం : అర్వింద్
  • పసుపు రైతుల శ్రేయస్సు కోసమే బోర్డు ఏర్పాటు: అర్వింద్
  •     పసుపు బోర్డు తీసుకురమ్మని ఓట్లేస్తే.. లిక్కర్ బోర్డు తెరిచిన కవిత
  •     సిరిసిల్లలో గల్ఫ్ కార్మికులు 400 నామినేషన్లు వేయాలె
  •     తెలంగాణలో హంగ్ వస్తే ఫస్ట్ పార్టీ మారేది రేవంత్ రెడ్డే
  •     మెట్​పల్లిలో పసుపు రైతుల కృతజ్ఞత సభ

మెట్ పల్లి, వెలుగు : పసుపు రైతుల నాలుగు దశాబ్దాల ఆకాంక్షను ప్రధాని మోదీ నెరవేర్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో రైతులు, బీజేపీ ఆధ్వర్యంలో  కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుతో ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు ఏర్పాటు చేసి ఏటా రూ.1600 కోట్ల ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బాండ్ పేపర్ లో రాసిచ్చిన మాట నిలబెట్టుకుని పసుపు బోర్డు తీసుకొచ్చాను అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం అన్ని రాష్ట్రల సీఎంలను కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు తీసుకురాలేదు.. కానీ లిక్కర్ బోర్డు తెరిచిందని ఆరోపించారు. 

నిజామాబాద్​లో 7 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో బీజేపీ సర్కారే

నిజామాబాద్ ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు. బీజేపీ కోసం ఇప్పటికీ రూ.50 కోట్లు ఖర్చు చేశానని ముందుముందు మరిన్ని ఖర్చు చేస్తానని చెప్పారు.  బీఆర్ఎస్ కు మళ్లీ ఓట్లు వేస్తే తమ కొడుకు, బిడ్డలకు శాపం పెట్టుకున్నట్లు అవుతుందన్నారు. కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో హాంగ్ ఏర్పడితే ఫస్ట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పారు. అతను ఓ బ్లాక్ మెయిలర్ అని రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కర్నాటక నుంచి హవాలా ద్వారా డబ్బులు తెప్పించుకుంటుందని శుక్రవారం రూ.50 కోట్లు ఐటీ ఆఫీసర్లు పట్టుకున్నారని తెలిపారు.

గల్ఫ్ బోర్డు మాట ఎటువాయే

గల్ఫ్ బోర్డు, రూ.500 కోట్లతో ప్రత్యేక ఎన్నారై పాలసీ తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే వాటిని పట్టించుకోని బీఆర్ఎస్ సర్కారుకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని అర్వింద్ అన్నారు. గల్ఫ్ బాధితుల ఆవేదన దేశమంతా తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో గల్ఫ్ కార్మికులు 400 నామినేషన్లు వేయాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పల్లె గంగారెడ్డి, మారంపల్లి సత్యనారాయణ, తల్లోజు ఆచారి, బొడ్ల రమేశ్​, సుఖేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


ఆశీర్వదించండి.. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా

ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు వేసి ఆశీర్వదించండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లు కూడా తెరిపిస్తామని అర్వింద్ అన్నారు. పసుపు బోర్డు ఇచ్చిన మోదీ సర్కారుకు షుగర్ ఫ్యాక్టరీలు తెరవడం పెద్ద పని కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూసివున్న షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించినట్లు తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసిన పాపం టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ దే అన్నారు. వంద రోజుల్లో ఫ్యాక్టరీలు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగా నడిపిస్తామని చెప్పిన కేసీఆర్, కవిత అధికారంలోకి వచ్చాక నడుస్తున్న ఫ్యాక్టరీలను కూడా మూసివేసి రైతులు, కార్మికులను రోడ్డున పడేశారని ఫైర్​అయ్యారు. ఈ ప్రాంతంలో చెరుకు, పసుపు రైతులు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని బీజేపీని గెలిపించే బాధ్యత రైతులందరూ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చెరుకు రైతు మామిడి నారాయణ రెడ్డికి శాలువాతో సన్మానం చేసి పాదాభివందనం చేశారు.