లోన్​ యాప్​ టార్చర్​తో నిజామాబాద్​ అర్బన్​ అభ్యర్థి సూసైడ్

లోన్​ యాప్​ టార్చర్​తో నిజామాబాద్​ అర్బన్​ అభ్యర్థి సూసైడ్
  • ఫోన్​ హ్యాక్​ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని బ్లాక్​ మెయిల్​
  • వేధింపులు భరించలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ అర్బన్​ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అలయన్స్​ ఆఫ్​​ డెమొక్రటిక్ ​అండ్​రీఫార్మ్స్​ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్​(36) శనివారం రాత్రి ఇంట్లో సూసైడ్​చేసుకున్నాడు. లోన్ ​యాప్​ నిర్వాహకుల వేధింపులే ఆయన బలవన్మరణానికి కారణమని కుటుంబీకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సాయినగర్​కు చెందిన కన్నయ్యగౌడ్ అద్దె ఇంట్లో ఉంటూ​.. కూరగాయల మార్కెట్​లో హోల్​సేల్ ​వ్యాపారం చేస్తున్నాడు.

ఏడాదిన్నర కింద మోర్తాడ్​ మండలం దొన్కల్​గ్రామానికి చెందిన ప్రవళికను పెండ్లి చేసుకున్నాడు. వారికి 5 నెలల బాబు ఉన్నాడు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో పాటు బ్యాంకు లోన్​ తీసుకొని వారం కింద కొత్త ఇల్లు కొన్నాడు. కొత్త ఇంట్లో శుక్రవారం మైసమ్మ పూజ చేశాడు. మరో పక్క గృహ ప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఏదో ఎమర్జెన్సీలో లోన్​ యాప్​ద్వారా తీసుకున్న రుణం రీపేమెంట్​ విషయంలో ఆయనకు వేధింపులు స్టార్ట్​ అయ్యాయి. అతడు వాడే ఫోన్ ​హ్యాక్ ​చేసిన లోన్​యాప్​ నిర్వాహకులు.. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

అడిగిన సొమ్ము ఇవ్వకుంటే ఫోన్​లో సేవ్​చేసిన నంబర్లకు లోన్​ చీటర్ అని మెసేజ్​లు పంపుతామని 4 రోజుల నుంచి బ్లాక్​ మెయిల్ ​చేస్తు న్నారు. ఎన్నికల నామినేషన్ ​టైమ్​లో ఆఫీసర్లకు అందించిన అఫిడవిట్​ కాపీని శనివారం ఆయనకు పంపి ఫోన్​లోని సమాచారమంతా తమ దగ్గర ఉందని బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన కన్నయ్య.. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కన్నయ్య ఉపయోగించిన ఫోన్​ను స్వాధీనం చేసుకొని అందులోని డాటాను సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తామని మీడియాకు చెప్పారు. కన్నయ్య గౌడ్​ మృతి విషయాన్ని కలెక్టర్ ​రాజీవ్​ గాంధీ హన్మంతు కేంద్ర ఎలక్షన్​ కమిషన్​కు నివేదించారు.