- మృతుడి తమ్ముడు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు
- కేసులో నిందితురాలితో పాటు
- మరో ఐదుగురు అరెస్ట్
- ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి వెల్లడి
నిజామాబాద్, వెలుగు : భర్త హత్య కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు, వారికి సహకరించిన నిందితులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామానికి చెందిన పల్లాటి రమేశ్(35), ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. అతని భార్య సౌమ్య అలియాస్ అరుణలత ఓ ప్రైవేట్ స్కూల్‌లో క్లర్క్ గా చేస్తుంది. వీరికి పిల్లలు లేరు. అదే స్కూల్ లో పీఈటీగా చేసే నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన నాళేశ్వరం దిలీప్‌తో ఆమెకు రెండేండ్ల కింద వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది రమేశ్‌కు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించు కోవాలని ప్రియుడు దిలీప్‌ను సౌమ్య కోరింది. అతడు వరుసకు తమ్ముడైన మాదాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అభిషేక్ సాయం కోరాడు.
ముందుగా కారుతో ఢీ కొట్టి..
గత ఆగస్టు12న బైక్ పై వెళ్లే రమేశ్‌ను అభిషేక్ కారుతో ఢీకొట్టి పారిపోయాడు. కాగా.. రమేశ్చేయి విరిగింది. మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు కేసు నమోదు చేశారు. అనంతరం అభిషేక్ తన ఫ్రెండ్ బంటు జితేందర్‌ను దిలీప్‌కు పరిచయం చేశాడు. సుపారి గ్యాంగ్ తో మర్డర్ చేయిస్తానని చెప్పి ప్లాన్ చేశాడు. కిసాన్ నగర్ తండాకు చెందిన కేలోత్ శ్రీరామ్ అలియాస్ బబ్లూ, రమావత్ రాకేశ్, దూదేకుల మోసిన్‌లతో రూ.35 వేలకు డీల్ కుదుర్చు కున్నారు.
సౌమ్యకు చెప్పగా తన గోల్డ్ రింగ్ ను దిలీప్ కు ఇవ్వగా ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సుపారి గ్యాంగ్‌కు ఇచ్చాడు. గత డిసెంబర్19న రాత్రి రమేశ్ అన్నం తిన్న తర్వాత నిద్ర మాత్రలు కలిపిన మంచినీటిని భర్తకు సౌమ్య ఇవ్వగా తాగిన అతడు గాఢనిద్రలోకి వెళ్లాక ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. అతను సుపారి గ్యాంగ్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అభిషేక్ తో పాటు దిలీప్ బైక్‌పై వెళ్లారు. నిద్రపోయిన రమేశ్మెడకు టవల్‌చుట్టి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం బైక్‌పై వెళ్లిపోయారు.
గుండెపోటు వచ్చిందని అంత్యక్రియలు
మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటులో చనిపోయాడని సౌమ్య బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. అదేరోజు అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే.. ఉపాధి కోసం ఇజ్రాయెల్ కు వెళ్లిన రమేశ్ తమ్ముడు కేదారికి అంత్యక్రియల వీడియోలు, ఫొటోలు పంపా రు. అన్న మెడకు గాయాలు ఉండడం చూసి అనుమానించి మాక్లూర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. బోర్గాం (కే)లోనే ఉండే తన భార్య అనూషతో కేదారి పోలీసులకు ఫిర్యాదు చేయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత డిసెంబర్ 24న తహసీల్దార్ సమక్షంలో డెడ్‌బాడీ వెలికి తీయించి పోస్టమార్టం చేయించగా హత్య చేసినట్టు తేలింది. సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్, అభిషేక్, బంటు జితేందర్, కేలోత్ శ్రీరామ్, రమావత్ రాకేశ్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
