బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తుండదు: డీకే అరుణ

బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తుండదు: డీకే అరుణ

మెట్ పల్లి, వెలుగు :  బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు లేదని, ఎప్పటికీ ఉండదని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విజయ సంకల్ప యాత్రలో  పాల్గొన్న ఆమె మాట్లాడారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. 

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసం జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా చేయించడం లేదన్నారు. కేసీఆర్ పై సైలెంట్ గా ఉండడం చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం పక్కా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ12 స్థానాల్లో గెలుస్తుందన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ మోరపల్లి సత్యనారాయణ, పల్లా గంగారెడ్డి, బొడ్ల రమేశ్, నవీన్ పాల్గొన్నారు.