టీకా వేసుకున్నా యాంటీ బాడీస్ రాలేదని కేసు

టీకా వేసుకున్నా యాంటీ బాడీస్ రాలేదని కేసు

లక్నో: కొవిషీల్డ్‌‌ వ్యాక్సిన్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లాపై ఓ వ్యక్తి కేసు పెట్టాడు. కొవిషీల్డ్ వేయించుకున్నా తన శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని ఆరోపిస్తూ ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి ఈ కేసు వేశాడు. పూనావల్లాతోపాటు కొవిషీల్డ్‌‌కు అనుమతినిచ్చిన డీసీజీఏ డైరెక్టర్, హెల్త్ మినిస్ట్రీ జనరల్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయ్‌పై లక్నోలోని ఆషియానా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు. 

ప్రతాప్ చంద్ర ఏప్రిల్ 8న కొవిషీల్డ్ తొలి డోస్‌ను తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాల్సిందని, కానీ డోసుల మధ్య అంతరాన్ని ప్రభుత్వం 12 వారాలకు పొడిగించడంతో తాను రెండో డోసు తీసుకోలేకపోయానని ఫిర్యాదులో చంద్ర తెలిపాడు. తొలి డోస్ వేయించుకున్న కొన్ని రోజుల తర్వాత తనకు అనారోగ్యంగా అనిపిచిందన్నాడు. దీంతో టెస్టులు చేయించుకోగా తన బాడీలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిసిందన్నాడు. దీంతోపాటు ప్లేట్‌‌లెట్స్ సంఖ్య కూడా 3 లక్షల నుంచి 1.5 లక్షలకు పడిపోయిందని గుర్తించినట్లు కంప్లయింట్‌లో పేర్కొన్నాడు. రక్తకణాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయినందున.. ఇప్పుడు కరోనా రిస్క్ తనకు ఎక్కువగా ఉందన్నాడు. చంద్ర ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు.. ఎఫ్‌‌ఐఆర్‌‌ను మాత్రం ఫైల్ చేయలేదు. ఈ విషయం సున్నితమైందని, కాబట్టి ఫిర్యాదు గురించి ఉన్నతాధికారులకు తెలియజేశామని పోలీసులు చెప్పారు.