ఏడువారాల జాతరకు  ఏర్పాట్లు ఏవీ..? 

ఏడువారాల జాతరకు  ఏర్పాట్లు ఏవీ..? 
  •     తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర  నుంచి భారీగా రానున్న భక్తులు 
  •     ఎనిమిదేండ్ల కింద ఎండోమెంట్ పరిధిలోకి ఆలయం
  •     ప్రతిఏటా ఆదాయం వస్తున్నా కనీస వసతులు కరువు
  •     టాయిలెట్లు, తాగునీటి కొరత.. కంకర తేలిన రోడ్లు
  •     ఇబ్బందుల్లో భక్తులు.. పట్టించుకోని దేవదాయ శాఖ

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ మంజీర తీరాన వెలసిన నల్ల పోచమ్మ ఏడు వారాల జాతర రానే వచ్చింది. ఉత్సవాలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయం ఎనిమిదేండ్లుగా ఎండోమెంట్ పరిధిలో కొనసాగుతోంది. అయితే ఆలయ డెవలప్​మెంట్​తో పాటు ప్రతి ఏడాది వేసవిలో 49 రోజులు జరిగే అతిపెద్ద మహోత్సవాలకు ఏర్పాట్లు కరువయ్యాయి. ఏటా ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ సరైన ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఎవరూ పట్టించుకోవట్లే.. 

ఎనిమిదేండ్ల కింద ఎండోమెంటో పరిధిలోకి ఆలయం వెళ్లినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కనీసం జాతర టైంలోనైనా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. సంబంధిత ఆఫీసర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోవట్లేదు. ఉమ్మడి మెదక్​ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు  తరలి వస్తుంటారు. సరైన సౌకర్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో సరైన గదులు, టాయిలెట్లు, బాత్​రూమ్స్​ లేవు. పక్కనే మంజీరా నీది ఉన్నా తాగునీటికి  తిప్పలు తప్పడం లేదు. ఎండాకాలంలో చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా భక్తులు సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షం పడితే తడిసి ముద్ద కావాల్సిందే.  ఆలయ ప్రాంగణంలో ఉన్న గుండంను శుభ్రం చేయకపోవడంతో ఎవరూ అందులోకి దిగే సాహసం చేయట్లేదు. 

అధ్వానంగా రోడ్లు

బోరంచ నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్లు కంకర తేలి అధ్వానంగా ఉన్నాయి. ఒక దారి నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామం మీదుగా మనూర్ మండలంలోని బోరంచకు వెళ్తుంది. రుద్రారం నుంచి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉంది. మరోదారి రేగోడ్ మండలం (టి)లింగంపల్లి అమ్మవారి కమాన్ నుంచి బోరంచ టెంపుల్  వరకు ఉంది.  ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి కనీసం నడవలేని స్థితిలో ఉంది. రెండేండ్లుగా కొవిడ్ ఆంక్షలు, లాక్ డౌన్ వల్ల జాతర జరగకపోయినా భక్తులు లేకుండా ఉత్సవాలు నిర్వహించారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈసారి ఉత్సవాలకు భక్తులు భారీగా రానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు బాగా లేకపోతే ప్రజలకు బ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు స్పందించి బోరంచ ఆలయానికి వెళ్లే రోడ్లను బాగుచేసి కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.