
- అరెస్టు చేస్తే బెయిల్‌పై వచ్చి తప్పించుకుంటున్న ఫారినర్లు
- గోవా, బెంగళూరులో మకాం.. కోర్టుల్లో కేసులు పెండింగ్
- శిక్షలు తప్పించుకుంటూ డ్రగ్స్ దందా
- డ్రగ్స్‌కు కేరాఫ్ గా ఆఫ్రికన్లు
- డిపోర్టేషన్ తో సొంత దేశానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్లు సహా విదేశీయులపై ఈగల్ డిపోర్టేషన్ అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ లాంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఈగల్. డ్రగ్స్ సప్లయ్ చేస్తూ పట్టుబడిన విదేశీయులను అరెస్టు చేసి జైలుకు పంపకుండా డైరెక్ట్‌గా వారి సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఇందుకోసం ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈగల్ టీమ్ సహా రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే పట్టుబడిన ఫారినర్ల వివరాలతో డేటా తయారు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన విదేశీయులు ప్రస్తుతం జైల్లో ఉన్నారా, లేక బెయిల్‌పై విడుదల అయ్యారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. వీరిని గుర్తించి డిపోర్ట్ చేయనున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్‌లోనే మకాం వేసిన 20 మందికి పైగా విదేశీలను ఇప్పటికే వారి దేశాలకు తరలించారు.
అరెస్ట్‌లు, బెయిల్, ఎస్కేప్ మళ్లీ దందా..
డ్రగ్స్ కేసులో దొరికిన విదేశీయులు బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ డ్రగ్స్ సప్లై దందా చేస్తున్నారు. మరి కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గోవా, ముంబై, బెంగళూరు సహా ఇతర రాష్ట్రాలకు మకాం మారుస్తున్నారు. కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. దీంతో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో ఫారినర్లు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. బెంగళూరు, గోవాలో నివాసం ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.
దీంతో డ్రగ్స్ సప్లయ్‌కి అడ్డుకట్ట పడడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులపై డిపోర్టేషన్ అస్త్రం ప్రయోగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనూ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినా.. కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. వీరు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు బలమైన ఆధారాలను చూపించలేకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి.
సొంత దేశానికి తిప్పి పంపితేనే డ్రగ్స్ దందా కట్టడి
ప్రస్తుతం డ్రగ్ టెస్ట్ కిట్స్ సహా ఆధునిక టెక్నాలజీతో అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను నెలల తరబడి జైల్లో ఉంచడం కన్నా పట్టుబడిన వెంటనే సొంత దేశానికి పంపగలిగితే డ్రగ్స్ సప్లయ్‌కి కొంత వరకైనా అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లు సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరిలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారితో పాటు డ్రగ్స్ బానిసలను కూడా గుర్తిస్తున్నారు.
చదువు పేరుతో వచ్చి నైజీరియన్ల మత్తు వ్యాపారం
ఆఫ్రికా దేశాల్లో డ్రగ్స్ వాడకం లీగల్. దీంతో అప్పటికే డ్రగ్స్ కు బానిసలైన ఆఫ్రికన్లు చదువుల పేరిట హైదరాబాద్‌కు వచ్చిన తరువాత కూడా కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ సహా మరికొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. గోవా, ముంబై నుంచి ప్రత్యేక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. చదువులు, బిజినెస్, హెల్త్, టూరిస్ట్ వీసాలపై వచ్చి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్నారు. స్థానికులను మాదకద్రవ్యాలకు బానిసలుగా చేసి వారితోనే సప్లయింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. వీసాల గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారు.