వానొచ్చినా.. వరదొచ్చినా..నో యాక్షన్!

వానొచ్చినా.. వరదొచ్చినా..నో యాక్షన్!
  • వానొచ్చినా.. వరదొచ్చినా..నో యాక్షన్!
  • మాన్సున్ టీమ్ లతో ప్రయోజనం లేదు
  • బల్దియాలో రెండేళ్లతో పోలిస్తే ఈసారి డబుల్ బృందాలు
  • కాల్ చేసిన వెంటనే సహాయక చర్యలు అందట్లే
  • అవగాహన లేనివారు ఉండటంతోనే సమస్య
  • జూన్ టు అక్టోబర్ వరకు  టీమ్​ల కొనసాగింపు 

హైదరాబాద్, వెలుగు :  వానాకాలంలో  సిటీలో ఎక్కడ వాన పడినా.. రోడ్లపై వరద నీరు నిలిచినా  ఎదురయ్యే ఇబ్బందులకు తక్షణ పరిష్కారం చూపడమే మాన్సూన్ టీమ్ ల డ్యూటీ.  జీహెచ్ఎంసీలో టీమ్​లను  పెంచినా ప్రయోజనం కనిపించడంలేదు. 2021లో 195, 2022లో 172  ఉండగా.. ఈసారి 394  బృందాలను రంగంలోకి దించారు. ఇందుకు బల్దియా రూ.40 కోట్లకి పైగా ఖర్చు చేయనుంది. వానలు పడేటప్పుడు, కురిసిన తర్వాత రోడ్లపై ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా, వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ద నీటిని క్లియర్ చేయాలి. ఎమర్జెన్సీ సమయంలోనూ రోడ్ల రిపేర్ల వంటి పనులు కూడా చేయాలి. గత నెల నుంచే మాన్సున్ టీమ్స్​ అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటాయి. అయితే బృందాల్లో చాలావరకు అనుభవం లేనివారు ఉన్నారు. వానలు పడ్డప్పుడు వెంటనే సహాయక చర్యలు కొనసాగక ఇబ్బందులు వస్తున్నాయి. మాన్సున్ టీమ్స్​ లో ఏం జరుగుతుందన్న దానిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని ఎక్స్ పర్ట్స్​పేర్కొంటున్నారు. 

వీఐపీ ప్రాంతాల్లోనే ఎక్కువ

బల్దియాలో 394 మాన్సున్ టీమ్స్​లో స్టాటిక్ లేబర్ టీమ్ లు 237 ఉండగా,  వాహనాలతో పాటు అన్ని రకాల పనిముట్లుండే మొబైల్ ఎమర్జెన్సీ టీమ్ లను157 ఏర్పాటు చేశారు.  రౌండ్ ది క్లాక్ మూడు షిఫ్టుల్లో పని చేయాలి. వీటికి సర్కిళ్ల వారీగా నిధులు కేటాయించారు. అయితే.. మాన్సున్ టీమ్స్​ ఏర్పాటులోనూ అధికారులు వివక్ష చూపినట్లు కనిపిస్తుంది. వానలతో ఇబ్బందులు పడే జోన్లలో తక్కువ టీమ్స్​ ని నియమించారు.  వీఐపీలుండే ఖైరతాబాద్ జోన్ కి ఎక్కవగా కేటాయించారు. ఎల్​బీనగర్ జోన్ కు 35 టీమ్స్.. ఖైరతాబాద్ జోన్ కు 133 టీమ్స్​కేటాయింపుపై విమర్శలు వస్తున్నాయి.  అన్ని జోన్ల కన్నా తక్కువగా కూకట్ పల్లి జోన్ కు నియమించారు. 

 అవగాహనలేని వారిని నియమించగా..  

 సిటీపై సరైన అవగాహన లేక వానలు పడినప్పుడు సహాయక చర్యలు వెంటనే చేపట్టడం లేదు. డీఆర్ఎఫ్ టీమ్స్​ వచ్చేలోపు ఎంతో కొంతైనా మాన్సున్ టీమ్స్ చర్యలు  తీసుకోవాలి. అయితే ఎలాంటి పనులు చేయడం లేదు. ఇందుకుకారణం మాన్సున్ టీమ్స్​ కు  అవగాహన లేకపోవడంతో పాటు వారితో పనులు చేయిస్తుండడంతో సమస్య వస్తుంది.  ప్రతిఏటా వానాకాలంలో రౌండ్ ది క్లాక్ సహా యక చర్యలకు ఎమర్జెన్సీ టీమ్ లను సిద్ధం చేశామని అధికారులు ప్రకటిస్తుంటారు.  పరిష్కార చర్యల పేరిట అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ద మోటార్లతో నీళ్లు ఎలా తోడేయ్యాలన్న అంశంపై కనీస అవగాహన లేని కూలీలతో టీమ్​లను ఏర్పాటు చేస్తుండగా వానలు పడ్డప్పుడు జనానికి ఇబ్బందులు తప్పడంలేదు. ఇటు ప్రజాధనం వృథా కావడంతో పాటు పనులు కూడా జరగడంలేదు.