ఉద్యోగాల కోతకు నో బ్రేక్​.. 5లక్షల జాబ్స్​ తగ్గించిన కంపెనీలు

ఉద్యోగాల కోతకు నో బ్రేక్​.. 5లక్షల జాబ్స్​ తగ్గించిన కంపెనీలు

వెలుగు బిజినెస్​ డెస్క్​: కిందటేడాది అక్టోబర్​ నుంచి ఇప్పటిదాకా గ్లోబల్​గా 5 లక్షల ఉద్యోగాలు పోయినట్లు బ్లూమ్​బర్గ్​ రిపోర్టు వెల్లడించింది. ఉద్యోగాల కోత పెడుతున్న కంపెనీల జాబితాలో తాజాగా వాల్​మార్ట్​ కూడా చేరింది. రెండు వేల మందిని తొలగిస్తున్నట్లు వాల్​మార్ట్ సోమవారం ప్రకటించింది. వైట్​ కాలర్​ ఉద్యోగాలే  ఎక్కువగా పోతున్నట్లు బ్లూమ్​బర్గ్​ పేర్కొంది. బిగ్​టెక్​ కంపెనీలతో మొదలైన జాబ్​ కట్స్​ ఆ తర్వాత ఇతర రంగాలలోని కంపెనీలకు, స్టార్టప్స్​కు చేరింది.

మెకిన్సే, కేపీఎంజీ వంటి కన్సల్టింగ్​ కంపెనీలు కూడా ఇప్పుడు ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఫెడెక్స్​కార్ప్​, బోయింగ్​వంటివైతే మిడిల్​ మేనేజ్​మెంట్​ లెవెల్​లోని ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కరోనా టైములో తమ సర్వీసులకు డిమాండ్​ జోరందుకోవడంతో ఉన్న వాళ్లు  చాలక కొత్త ఉద్యోగులను చాలా మందిని తీసుకున్నాయి బిగ్​టెక్​ కంపెనీలు. విమియో వంటి వీడియో స్ట్రీమింగ్​ కంపెనీల రెవెన్యూ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. మరోవైపు షేర్లు కూడా పతనమవుతున్నాయి.

దీంతో ఇలాంటి కంపెనీలన్నింటికీ  ఉద్యోగాల కోత తప్పడం లేదు. కరోనా టైములో అందరూ ఆన్​లైన్​ వీడియోల కోసం ఎగబడటంతో తమ వ్యాపారం బాగా సాగిందని విమియో సీఈఓ అంజలి సూద్​ ఇటీవల ఫోర్బ్స్​కు చెప్పారు. ఇప్పుడు ఎంటర్​ప్రైజ్​ కస్టమర్ల కోసం తాము వెతుక్కుంటున్నామని ఆమె పేర్కొన్నారు. మరోవైపు చాలా పనులకు  వర్కర్లు దొరకని పరిస్థితి బ్లూ–కాలర్ జాబ్స్​ మార్కెట్లో కనిపిస్తోంది. వైట్​కాలర్​ ఉద్యోగాల కోత ఇక్కడితో ఆగుతుందా...ఇంకా కొనసాగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఒకవేళ గ్లోబల్​గా రెసిషన్​ వస్తే మాత్రం ఈ ఉద్యోగాల కోత మరింత ఎక్కవయ్యే అవకాశాలున్నాయని బ్లూమ్​బర్గ్​ రిపోర్టు చెబుతోంది.  చాట్​జీపీటీ వంటి ఆటోమేషన్​ ట్రెండ్స్​ ఇప్పుడిప్పుడే సంచలనాలకు తెరతీస్తున్నాయని...ఉద్యోగాలపై వాటి ఎఫెక్ట్​ ఏమిటనేది తెలవడానికి మరికొంత సమయం పట్టొచ్చని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.