కోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్

కోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీవాసులు భయపడవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కేజ్రీవాల్ సూచించారు. కోవిడ్ 19 పరిస్థితిపై ప్రధాని మోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చైనాతో పాటు ఇతర దేశాల్లో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, అయితే... ఢిల్లీలో ఇప్పటి వరకు ఈ వేరియంట్ రూపాంతరం చెందలేదని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నామని..  ప్రస్తుతం ఢిల్లీలో XBB వేరియంట్ కేసులు వస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీలో కోవిడ్ పేషెంట్ల కోసం 8,000 పడకలు ఉన్నాయని కేజ్రీవాల్ వెల్లడించారు. తాము కోవిడ్ కు సంబంధించి అదనంగా 36,000 పడకలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో 928 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే.. 380 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని.. మరిన్ని అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అమలు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.