ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవట!

ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవట!
  • ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవట!
  • ఆర్టీఐ అప్లికేషన్​కు గురుకుల విద్యాసంస్థల రిప్లై
  • స్టూడెంట్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరలేదని వెల్లడి
  • పిల్లల నుంచి కంప్లైంట్లూ లేవంటూ జవాబు
  • పాత డైట్ చార్జీల వివరాలనే వెల్లడించిన గురుకుల సొసైటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నా.. ఎక్కడా అలాంటి ఘటన జరగలేదని గురుకుల విద్యాసంస్థలు చెప్తున్నాయి. ఫుడ్​మెనూ, చార్జీలు, ఫుడ్ పాయిజనింగ్​పై చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్సీ, బీసీ గురుకులాల విద్యాసంస్థలు తాజాగా ఈ జవాబు ఇచ్చాయి. గురుకులాల్లో నాణ్యమైన ఫుడ్ పెడ్తున్నామని.. విద్యార్థులెవరూ అస్వస్థతకు గురి కాలేదని తెలిపాయి. ఆహార నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్​మెంట్లు వెళ్లాయా అన్న ప్రశ్నకు ‘నిల్’ అంటూ పేర్కొన్నాయి. స్టూడెంట్లు మెంబర్లుగా ఉన్న ఫుడ్ కమిటీలు పనిచేస్తున్నాయో లేదో కూడా రిప్లైలో చెప్పలేదు.  అసలు ఫుడ్ బాగాలేదంటూ పిల్లల నుంచి కంప్లైంట్లే రాలేదని పేర్కొన్నారు.

ఐదేండ్లలో చాలా ఫుడ్ పాయిజనింగ్ కేసులు

ఆర్టీఐ రిప్లైలో అసలు ఫుడ్ పాయిజనింగ్ కేసులే లేవని గురుకుల విద్యాసంస్థలు చెప్తుంటే.. చాలా కేసులు నమోదైనట్టు నిరుడు జులైలో సర్కార్​కు రాష్ట్ర ఆరోగ్య శాఖనే రిపోర్ట్ ఇచ్చింది. విద్యార్థులు గ్యాస్ట్రో సమస్యలు ఎదుర్కొన్నారని ఆ రిపోర్ట్​లో పేర్కొంది. 2017లో 244 మంది, 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది విద్యార్థులు ఫుడ్​ పాయిజనింగ్ ఘటనలు జరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. నిరుడు అనధికారిక లెక్కల ప్రకారమే (మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం) 400 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటు ఈ ఏడాది ఇప్పటి వరకు ఫుడ్ పాయిజనింగ్ కేసుల్లో దాదాపు వంద మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మైనారిటీ సంక్షేమ గురుకులాలు సహా అన్నింటిలోనూ ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. కాగజ్​నగర్​లోని మైనారిటీ గురుకులంలో ఆరు నెలల్లోనే రెండు సార్లు ఫుడ్​పాయిజన్ ఘటనలు జరిగాయి. చాలా చోట్ల స్టూడెంట్లు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. అధికారులు, వార్డెన్లకు ఫిర్యాదులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ, గురుకుల విద్యా సంస్థల సొసైటీ మాత్రం ఒక్క కేసు నమోదు కాలేదని, విద్యార్థులు అస్వస్థతకు గురికాలేదని చెప్పడం గమనార్హం.

ఫుడ్​ పాయిజన్​ ఘటనల్లో కొన్ని..

  • 2023 ఏప్రిల్ 7: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మైనారిటీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత.
  • 2023 మార్చి 9: మహబూబాబాద్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 51 మంది విద్యార్థినులకు అనారోగ్యం. ఆస్పత్రిలో చికిత్స.
  • 2022 సెప్టెంబర్ 20: కాగజ్ నగర్ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.
  • 2022 సెప్టెంబర్ 6: వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన గురుకుల విద్యాలయంలో ఫుడ్​ పాయిజన్ జరిగి 40 మంది విద్యార్థినులకు అస్వస్థత.
  • 2022 ఆగస్టు 27: సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని 15 మంది చిన్నారులకు అనారోగ్యం.
  • 2022 జులై 31: ఈ ఒక్కరోజే మూడు చోట్ల ఫుడ్​ పాయిజనింగ్ ఘటనలు జరిగాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని బీసీ వెల్ఫేర్​ గురుకుల స్కూల్​లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలను తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు. అయితే, పిల్లలుంటున్న గదులు అపరిశుభ్రంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రి కేటీఆర్​ నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం.  

సిద్దిపేటలో సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​లో ఫుడ్ పాయిజనింగ్​తో 22 మంది విద్యార్థినులకు అస్వస్థత. మంత్రి హరీశ్ రావు ఇలాకాలోని స్కూల్​లోనే ఈ ఘటన జరిగింది.
మహబూబాబాద్ గిరిజన స్కూల్​లో ఫుడ్ పాయిజనింగ్​తో 38 మంది విద్యార్థులకు అస్వస్థత.

డైట్ చార్జీలు పెంచలేదా?

డైట్ చార్జీలను పెంచుతూ ఇటీవల రాష్ట్ర సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. దాని ప్రకారం ఏడో తరగతి వరకు రూ.950గా ఉన్న చార్జీలను రూ.1200, ఎనిమిదో తరగతి నుంచి పది వరకు రూ.1,100గా ఉన్న చార్జీలను రూ.1,400కు, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500 ఉన్న చార్జీలను రూ.1,875కు పెంచారు. ఆ చార్జీలను పెంచుతున్నట్టు ఈ ఏడాది మార్చి 2న సర్కారు ప్రకటించింది. ఆ లెక్కన ఏడో తరగతి వరకు రూ.40, టెన్త్ వరకు రూ.46, ఆ తర్వాతి స్థాయి విద్యార్థులకు 62.5 రూపాయలను ఒక్కో విద్యార్థిపై రోజుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఆర్టీఐ రిప్లైలో మాత్రం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సెక్రటరీగా ఉన్నప్పటి 2019-2020 చార్జీల వివరాలనే వెల్లడించాయి. ఆ ఏడాది మెనూ వివరాలనే ఇచ్చింది. ఆ లెక్క ప్రకారం పాత డైట్ చార్జీలనే చెల్లిస్తున్నట్టు తేలింది. డిగ్రీ విద్యార్థులకు నెలకు (30 రోజుల లెక్క) రూ.1,500, ఏడో తరగతి వరకు రూ.1,025, పది వరకు రూ.1,100 చార్జీలనే చెల్లిస్తున్నట్టు రిప్లైలో పేర్కొంది.