
- పది రోజులకోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వుల పేరిట హడావుడి
- ఉద్యోగ నియామకాలపై సాగదీత.. ఎలక్షన్ల దాకా తీసుకెళ్లే యోచన
- ఇప్పటిదాకా 49,428 పోస్టులకు పర్మిషన్లు
- నోటిఫికేషన్లు ఇచ్చింది 17,880 పోస్టులకే
- మరో 31,548 పోస్టుల నోటిఫికేషన్లు పెండింగ్‌లో
- 30,611 పోస్టులకు ఇంకా అనుమతివ్వని ఆర్థిక శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. ఉద్యోగాలు నింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక శాఖ అనుమతులంటూ పది రోజులకోసారి హడావుడి చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. 80 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి, ఇప్పటిదాకా 49,428 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ వేర్వేరు సమయాల్లో జీవోలు జారీ చేసింది. కానీ కేవలం 17,880 పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులోనూ 16,027 పోస్టులు పోలీస్ శాఖకు చెందినవి కాగా, గ్రూప్–1 పోస్టులు 503, వైద్యారోగ్య శాఖలో 1,326 పోస్టులు, 24 ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇంకా 31,548 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. మరో 30 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. మొత్తంగా 62,159 పోస్టుల భర్తీ ప్రక్రియ కొలిక్కి రావాల్సి ఉంది.
పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలక్షన్ల దాకా సాగదీయాలని ప్రభుత్వం చూస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై తొలిసారిగా 2020 డిసెంబర్ 13న ప్రకటన చేశారు. ఆ రోజు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇలా 2022 మార్చి 12 వరకు ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో, బయట పలుమార్లు కేసీఆర్ హామీలు ఇచ్చారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది మార్చి 13న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆ రోజు నుంచే నోటిఫికేషన్లు విడుదలవుతాయని సీఎం ప్రకటించారు. కానీ గడిచిన నాలుగు నెలల్లో కేవలం మూడు నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ప్రభుత్వం భర్తీ చేయబోయేవి కొత్త ఉద్యోగాలు కాదు. ఇవన్నీ బడ్జెట్ శాంక్షన్ పోస్టులే. అలాంటి పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడమనేది ఫార్మాలిటీనే. అయినా ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడమేగాక, నోటిఫికేషన్ ఇచ్చేసినట్లు హంగామా చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆర్థిక శాఖ అనుమతుల పేరిట కొన్నాళ్లు, నోటిఫికేషన్ల పేరిట ఇంకొన్నాళ్లు సాగదీసి.. మొత్తంగా ఎన్నికల వరకు లాక్కెళ్లేలా ఉన్నారనే ప్రచారం నిరుద్యోగ వర్గాల్లో జరుగుతోంది. గ్రూప్ – 1కు(ప్రిలిమినరీ) అక్టోబర్ 16న, ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్ పోస్టులకు ఆగస్టు 21న పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వడం, మెయిన్ ఎగ్జామ్‌కు డేట్‌కు మరో ఆర్నెల్లు పట్టొచ్చని అంచనా. పోలీస్ ఎగ్జామ్స్, ఈవెంట్స్ డేట్స్ ప్రకటించడానికి అంతే సమయం పట్టే అవకాశముంది. మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్ష తేదీలను ప్రకటించే నాటికి ఎన్నికలు ముంచుకొస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీరా ఎన్నికలు వచ్చాక.. ఎన్నికలు రావడం వల్లే పోస్టులు భర్తీ చేయలేకపోయామని, తమను గెలిపిస్తే పోస్టులు భర్తీ చేస్తామని ప్రచారం చేసుకునేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కామన్ బోర్డులో కదలిక ఏదీ?
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కానీ ఐదేళ్లయినా ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల కిందట కామన్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్, సభ్యులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ తదితరులను సభ్యులుగా నియమించారు. కామన్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీపై చర్చించేందుకు బోర్డు సభ్యులు సమావేశం కాలేదు. కామన్ బోర్డుకు చట్టబద్ధత కల్పించేందుకు యూనివర్సిటీ చట్టాల్లో సవరణ చేయాల్సి ఉంది.
మిగతావి ఎప్పుడు?
ఆర్థిక శాఖ అనుమతి పొందిన మొత్తం 49,428 పోస్టుల్లో 11,966 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 527 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్బీ) ద్వారా 18,279 పోస్టులకుగాను 16,027 పోస్టులకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా 10,028 పోస్టులకుగాను 1,326 పోస్టులకే నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ద్వారా భర్తీ చేయాల్సిన 9,096 పోస్టులకు, డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన 59 పోస్టులకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
టెట్ రిజల్ట్స్ ఇచ్చినా టీచర్ పోస్టుల భర్తీలో జాప్యం
టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలొచ్చి 25 రోజులు దాటినా.. ఖాళీలపై స్పష్టత రాలేదు. టెట్ ఫలితాలు రాగానే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీంతో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే టీచర్ పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీ కోసం టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సర్కారు బడుల్లోని టీచర్ పోస్టులను నింపుతామని ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. 13,086 పోస్టులున్నట్టు పేర్కొన్నారు. అయితే వీటిలో టీచింగ్ పోస్టులు సుమారు 11 వేలు, మిగిలినవి నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన కేవలం సర్కారు స్కూళ్లలో 9 వేల దాకా ఖాళీలు చూపించే అవకాశముందని తెలుస్తోంది. కనీసం ఈ పోస్టుల భర్తీకి కూడా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇక రాష్ట్రంలోని వివిధ సొసైటీల్లో గురుకులాల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఎస్సీ గురుకులాల్లో 2,267, ఎస్టీ గురుకులాల్లో 1,514, బీసీ గురుకులాల్లో 3,870, మైనార్టీ గురుకులాల్లో 1,445 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్లు జారీ చేయలేదు.
62 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇయ్యాలె..
80 వేల పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటిం చారు. కానీ ఇప్పటి వరకు పోలీస్, గ్రూప్ 1 పోస్టులకు తప్ప పెద్ద నోటిఫికేషన్లేవీ ఇవ్వలేదు. పోరాడే వారిని అణచి వేసేందుకు పోలీసులు అవసరం కాబట్టి, ఆ పోస్టులనే కేసీఆర్ భర్తీ చేస్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. - మొగిలి వెంకట్ రెడ్డి, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకుడు
ఎన్నికలకు ముందే పోస్టులన్నీ భర్తీ చేయాలె..
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరుసగా నోటి ఫికేషన్లు విడుదల చేయాలి. ఎన్నికలు వచ్చే వరకు నోటి ఫికేషన్లు జారీ చేస్తూ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు.. ఎన్ని కలకు ముందే పోస్టులన్నీ భర్తీ చేయాలి. మోసం చేయాలని చూస్తే టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు. - బానోత్ మదన్ లాల్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి
నిరుద్యోగుల్లో ‘ముందస్తు’ ఆందోళన
ఖాళీ పోస్టుల భర్తీ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు. జాబ్ నోటిఫికేషన్లు వస్తాయనే భరోసాతో కొందరు తమ ప్రైవేట్ జాబ్స్ మానేసి మరీ చదువుతున్నారు. కానీ ప్రభుత్వం టీఆర్టీ, గురుకుల టీచర్, గ్రూప్ -2, 3, 4, వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోవడం, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల మూడ్ కనిపిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
నోటిఫికేషన్ ఇవ్వాలి
ఐదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయట్లేదు. టెట్ రిజల్ట్ ఇచ్చి నెలవుతున్నది. అయినా టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వెంటనే ఫైనాన్స్ శాఖ అనుమతి ఇచ్చి.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. - రాంమోహన్‌రెడ్డి, డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు