వానలు పడుతుండటంతో ఆందోళనలో రైతులు

వానలు పడుతుండటంతో ఆందోళనలో రైతులు
  • టార్పలిన్లు జాడలేవు.. గన్నీ బ్యాగుల  ముచ్చటేలేదు

మెదక్​, వెలుగు:  వరి కోతలు మొదలై వడ్లు వస్తున్నాయి. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో వడ్లు తడుస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై క్లారిటీ లేదు. ఎప్పుడు ఓపెన్​ చేస్తారో ఆఫీసర్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. వరి కోయకుండా పొలంలోనే ఉంచుదామంటే వానలకు పైరు నేలకొరుగుతోంది. కోసి సెంటర్ల దగ్గర కుప్పలు పోస్తే వానకు తడిసిపోతోంది. దీంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా  మారింది.  

కోతలు స్టార్ట్​ అయ్యాయి..

మెదక్​జిల్లాలో వానాకాలంలో 2.43 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ముందుగా వేసిన వరి కోతకు సిద్ధం కాగా, గత నాలుగైదు రోజుల నుంచి హార్వెస్టర్​లతో కోతలు షురూ అయ్యాయి. రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు, మార్కెట్ యార్డ్ లకు తరలిస్తున్నారు. యార్డుల్లో పెద్దమొత్తంలో ధాన్యాన్ని ఆరబోశారు. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో కొల్చారం మండలం అప్పాజిపల్లి, పోతంశెట్టిపల్లి, మెదక్​ మండలం మాచవరం వద్ద, మెదక్ మార్కెట్​ యార్డులో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. ఆదివారం పడిన వానకు తడిసిన ధాన్యాన్ని సోమవారం ఆరబోయగా మళ్లీ వర్షం కురిసింది. టార్పలిన్లు లేకపోవడంతో వర్షం నుంచి వడ్లను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది.  

కొనుగోలు కేంద్రాల జాడ లేదు.. 

ఈ సీజన్ లో రైతుల నుంచి వడ్లు కొనేందుకు జిల్లాలో 350 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. అయితే ఎవరి ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు. గత యాసంగి సీజన్ లోనూ సెంటర్ల ఏర్పాటు లేటవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మాయిశ్చర్​మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డిజిటల్​వేయింగ్​మిషన్లు, గన్నీ బ్యాగులు.. వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  ప్రతిసీజన్​లో గన్నీ బ్యాగులు, ధాన్యం తరలింపు సమస్య ఉండనే ఉంది. ప్రస్తుత సీజన్​కు కోటి 60లక్షల గన్నీ బ్యాగులు అవసరముండగా.. 40 లక్షల బ్యాగులే అందుబాటులో ఉన్నాయి.  కాంటా పెట్టిన వడ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రైస్​ మిల్లులకు, ఇతర జిల్లాలకు తరలించేందుకు రెండు వేల లారీలు అవసరం. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

వాన పడి వడ్లు తడిసినయి

మేము వానాకాలంలో 10 ఎకరాల్లో వరి వేసినం.8 ఎకరాలు పంట కోసి ఎండబోసినం. వాన పడి వడ్లన్నీ తడిసిపోయినయి. వానకు తడ్వకుంట కప్పుదామంటే టార్పలిన్లు లేవు. కష్టపడి పండించిన వడ్లు ఇట్ల తడిసిపోతే మాకు మస్తు నష్టమైతది. సెంటర్​ ఎప్పుడు తెరుస్తరో, వడ్లు ఎప్పుడు కాంట పెడ్తరో.

- శోభ, రైతు, మాచవరం

సెంటర్​ జల్ది తెరవాలి

ముందుగా వేసిన వరి కోతలు మొదలైనయి. వడ్లు సెంటర్​ దగ్గరకు తెచ్చి ఎండబోసినం. వాన పడి వడ్లన్నీ తడిసినయ్.. టార్పలిన్ లు లేక తిప్పలైతాంది. ​చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. అందువల్ల కొనుగోలు సెంటర్లు జల్ది తెరిచి వచ్చిన వడ్లు వచ్చినట్టు కాంటా పెట్టాలి.  

- సాయిని నర్సింలు, పోతంశెట్​పల్లి