లెఫ్ట్- బీఆర్​ఎస్​.. పొత్తుపై నో క్లారిటీ

లెఫ్ట్- బీఆర్​ఎస్​.. పొత్తుపై నో క్లారిటీ
  • ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదన 
  • మూడు చొప్పున అసెంబ్లీ సీట్లు కోరుతున్న సీపీఎం, సీపీఐ 
  • స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్, అయోమయంలో లెఫ్ట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై  స్పష్టత రావడంలేదు. దీంతో  సీపీఎం, సీపీఐ పార్టీల్లోని నేతలతోపాటు ఆయా పార్టీలు అడుగుతున్న స్థానాలను ఆశిస్తున్న బీఆర్ఎస్ నేతల్లోనూ అయోమయం నెలకొన్నది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ​అభ్యర్థికి సీపీఎం, సీపీఐ మద్దతిచ్చాయి. ఆ ఎన్నికలో తక్కువ ఓట్లతోనే  బీఆర్ఎస్ గెలిచింది. అప్పటి నుంచి లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు అధికార పార్టీ సానుకూలంగా ఉంది. 

ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పెద్దలు పలు సభల్లోనూ ప్రస్తావించారు. ప్రస్తుతం పొత్తులపై క్లారిటీ ఇవ్వకుండానే  ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నది.  దీంతో మూడు పార్టీల్లోని నేతల్లో టెన్షన్​ మొదలైంది. మరో వైపు పొత్తు ఉన్నా లేకున్నా కలిసే పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం  నిర్ణయించుకున్నాయి. చెరో12 నుంచి15 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నాయి.  

చర్చలు జరిగి రెండు వారాలైనా..

లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై15 రోజుల క్రితం రెండు పార్టీల పెద్దలు చర్చించినట్టు తెలిసింది. సీపీఎంకు భద్రాచలంతోపాటు రెండు ఎమ్మెల్సీలు,  సీపీఐకి మునుగోడుతోపాటు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని బీఆర్​ఎస్​ ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను లెఫ్ట్​పార్టీలు తిరస్కరించినట్టు తెలుస్తున్నది. తమకు మూడు సీట్ల చొప్పున ఇవ్వాలని  బీఆర్ఎస్ కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. 

ఈ ఇష్యూ జరిగి రెండు వారాలు అవుతున్నా బీఆర్ఎస్ నుంచి స్పష్టత రాలేదు. కొత్తగూడెం, హుస్నాబాద్ ఇవ్వాలని సీపీఐ పట్టుపడుతుండగా.. భద్రాచలంతోపాటు మిర్యాలగూడ, పాలేరు సీట్లను సీపీఎం కోరుతున్నది. అయితే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో తాము కోరుతున్న సీట్లుంటే.. వెంటనే సీపీఎం, సీపీఐ ఐదు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలకు కొంతబలం ఉంది. ఆ పార్టీలతో పొత్తు ఉంటే రెండు జిల్లాల్లో గెలుపు అవకాశాలు మెరుగవుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే, పొత్తులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని లెఫ్ట్ పార్టీల నేతలుచెప్తున్నారు.