సీఎం దత్తత గ్రామం చిన్నముల్కనూర్ సిన్నబోతాంది!

సీఎం దత్తత గ్రామం చిన్నముల్కనూర్ సిన్నబోతాంది!
  • కమ్యూనిటీ హాళ్లు కాలే.. ఫంక్షన్ హాల్​ రాలే
  • 500 డబుల్​ బెడ్​రూం ఇండ్లలో సగం కూడా కట్టలే
  • సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తికాలే
  • పాత భవనంలోనే గ్రామ పంచాయతీ ఆఫీసు
  • ఫండ్స్​ రాకే పనులు చేయలేదంటున్న ఆఫీసర్లు

చిన్న ముల్కనూర్​ను నేను దత్తత తీసుకుంటన్న. ఊళ్లె పాత ఇండ్లన్నీ కూలగొట్టుకోన్రి. ఎంత మంది ఉంటే అంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తం. ఇంజినీర్లు వచ్చి కొలుస్తరు. సిటీలో ఉన్నట్లు లైన్ మీద ఉండాలె. ఎక్కువలో ఎక్కువ నాలుగు నెలల్ల సున్నాలు వేసుకొని ఇండ్లళ్లకు పోవాలె. ఆ రోజు దావత్​ చేసుకోవాలె. ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందం. ఎస్సీలకు స్పెషల్ గా పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టిస్త. సుట్టు పదూళ్లళ్ల  ఏ శుభ కార్యం చేసుకున్నా, అపకార్యం చేసుకున్నా.. అందరికీ పనికొచ్చేటట్లు పెద్ద ఫంక్షన్ హాల్ కడ్తం. రోడ్డు నడిమిట్ల డివైడర్​కట్టి, సెంట్రల్​లైటింగ్​ పెడ్తం. నేను మళ్లోసారి వచ్చెసరికి  మొత్తం లైట్లతో జిగేల్​ మనాలె..’
2015, ఆగస్టు 24న కరీంనగర్​ జిల్లా చిన్నములకనూర్​లో సీఎం కేసీఆర్​

కరీంనగర్, వెలుగు:కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్నములకనూర్ ​గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ గ్రామస్థులకు అనేక హామీలిచ్చారు. ఇది జరిగి ఆరేండ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు  500 డబుల్​ బెడ్​రూం ఇండ్లలో 243 ఇండ్లు, కొన్ని సీసీ రోడ్ల నిర్మాణం తప్ప ఏమీ చేయలేదు. ముఖ్యంగా ఫంక్షన్​ హాల్​, కమ్యూనిటీ భవనాలు కట్టలేదు. చాలా వార్డుల్లో సీసీ రోడ్లు వేయలేదు. డివైడర్​, సెంట్రల్ ​లైటింగ్​ సిస్టమ్​ ఏర్పాటు చేయలేదు. రైతులకు డ్రిప్ ​ఇరిగేషన్​ యూనిట్లు అందించలేదు. ఇప్పటికీ గ్రామపంచాయతీ పాత భవనంలోనే కొనసాగుతున్నది. ప్రభుత్వం నుంచి ఫండ్స్​ రాకపోవడం వల్లే పనులు చేయలేకపోయామని ఆఫీసర్లు చెబుతున్నారు. 
డబుల్​ బెడ్​రూం ఇండ్లు సగమే.. 
చిన్న మూల్కనూరు గ్రామంలో మొత్తం 570 కుటుంబాలు ఉండగా, 500 డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సారు చెప్పిండని ఆఫీసర్లు వారం, పదిరోజుల వ్యవధిలో పాత ఇండ్లన్నీ పడగొట్టించారు. తీరా ఐదేండ్ల వ్యవధిలో కేవలం  243 ఇండ్లు మాత్రమే నిర్మించారు. ఇప్పటికీ గృహప్రవేశం చేయించక కొన్ని పడావు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో ఇండ్లు లేని సుమారు150 మంది అర్హులు డబుల్​బెడ్​రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫీసర్లను అడిగితే  త్వరలోనే రెండో లిస్టు వస్తది అంటూ రెండేండ్లుగా ఒకే మాట చెబుతున్నారు.
డ్రిప్​ ఇరిగేషన్​ అటే పాయె..
చిన్నముల్కనూర్​లో 600 మంది రైతులున్నారు. కరీంనగర్​ సిటీకి దగ్గరగా ఉండడంతో కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని, ఇందుకోసం ప్రతి రైతుకు డ్రిప్ ఇరిగేషన్​ యూనిట్​ మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ ​​యూనిట్​మంజూరు కాలేదు. గౌరవెళ్లి రిజర్వాయర్​ నీళ్లు వచ్చేలా చూస్తామని సీఎం చెప్పినా ఇంకా కాలువ పనులే మొదలుకాలేదు.
ఫంక్షన్​ హాల్, కమ్యూనిటీ హాళ్లు కాలే..
ఊరిలో పెళ్లిళ్లు,  ఫంక్షన్లు, ఇతరత్రా వేడుకలు  చేసుకునేందుకు పెద్ద అధునాతన ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని సీఎం చెప్పారు. సారు చెప్పారని గ్రామస్థులు రజాకార్ల కాలంనాటి పురాతన డాక్​ బంగ్లాను నేలమట్టం చేశారు. కానీ ఇప్పటివరకు ఫండ్స్​ రాక ఫంక్షన్​హాల్​ ఏర్పాటు చేయలేదు. అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని సీఎం చెప్పినా పైసా రాలేదు. మహిళా సంఘానికీ భవనం కట్టివ్వలేదు. 
సీసీ రోడ్లు కాలే.. 
గ్రామంలో  ఏ వాడ చూసినా  సీసీ రోడ్లతో అందంగా  మెరిసిపోవాలని సీఎం చెప్పారు. కానీ  1, 4, 9 వార్డుల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే కనిపిస్తున్నాయి.  డ్రైనేజీలు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మెయిన్​రోడ్డు మధ్యలో డివైడర్​, సెంట్రల్​ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా డివైడరూ కాలే, సెంట్రల్​ లైటింగ్​ సిస్టమూ రాలే. పంచాయతీ నేటికీ పాత భవనంలోనే కొనసాగుతున్నది. 
సీఎం సారు మాట నిలబెట్టుకోవాలె.. 
గ్రామంలో అందరికీ డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇస్తమని సీఎం సారు చెపిండ్రు. కానీ సగం మందికే వచ్చినయ్. మిగిలిన కుటుంబాలు ఇంకా ఎదురుచూస్తున్నయి. సెకండ్​ లిస్టు, థర్డ్​ లిస్టు.. అంటూ ఆఫీసర్లు దాటేస్తున్నరు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇంకా పూర్తికాలేదు. ఊరందరికీ ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్ కడతమన్నరు. సీఎం మాటలు నమ్మి రజకార్ల కాలం నాటి డాక్​ బంగ్లా కూల్చేసినం.  ఆఫీసర్లను అడిగితే ఫండ్స్​ రాలేదంటున్నరు. ఇప్పటికైనా సీఎం సారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె. 
                                                                                                                                                        – సాంబారి బాబు, మాజీ సర్పంచ్,  చిన్న ముల్కనూర్ 
ఇల్లు ఇస్తమని మోసం చేసిన్రు
కేసీఆర్​ సారు మా ఊరిని దత్తత తీసుకున్నంక అందరికీ ఇండ్లు ఇస్తమని చెప్పిన్రు. ఆయన మా ఊరికి వచ్చిన రోజు ఆఫీసర్లు మా ఇంటికి వచ్చి వివరాలన్ని రాసుకొని పోయిన్రు. తప్పకుండా ఇల్లు కట్టిస్తమని చెప్పిండ్రు. ఐదేండ్లు దాటిపోయినా ప్రభుత్వం మా కుటుంబానికి ఇల్లు కట్టియలేదు. నాకు భర్త లేడు. ఇద్దరు కొడుకులతోని రేకుల షెడ్​లో ఉంటున్నం. మాకు ఇల్లు ఇస్తమని మోసం చేసిన్రు.                                                                    –పండిపెల్లి లక్ష్మి, చిన్నముల్కనూర్