ఐనవోలు జాతరకు నత్తనడకన అభివృద్ధి పనులు

ఐనవోలు  జాతరకు నత్తనడకన అభివృద్ధి పనులు

వందేళ్ల సంప్రదాయ జానపద జాతరకు కేరాఫ్ ఐనవోలు. అక్కడి ఆలయంలో  అడుగుపెట్టగానే శత అష్టోత్తర స్తంభాలతో..కాకతీయ శిల్పకళా తోరణం స్వాగతం  పలుకుతుంది. ఏటా మూడు నెలల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గండాలు తీరితే గండదీపం పెడతాం..కోరికలు తీరితే కోడెను కడతాం.. పంటలు పండితే పట్నాలు వేస్తాం.. అంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు.  ఐనవోలు జాతర ఏర్పాట్లపై వీ6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి ఏంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకునేందుకు దూరప్రాంతాల  నుంచి భక్తులు వస్తుంటారు. ఏటా మకర సంక్రాంతి సమయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. దీనికి ముందు స్వామి వారి ఆలయంలో ఐదు రోజుల పాటు రంగులు వేసే ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సంక్రాంతి నంచి  ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.జాతరకు  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు వస్తారు. సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం వెళ్లే భక్తులు సంక్రాంతి సమయంలో ఐనవోలు మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించేందుకు వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే  సంక్రాంతి, కనుమ రోజుల్లోనే 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. 

రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాల్లో ఒకటిగా ఉంది ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళాచాతుర్యం నుంచి స్వామివారి ఉత్సవాలవరకూ ప్రతిదీ ప్రత్యేకమే. ఈ ఆలయంలో స్వామివారు మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు పేరుతో పూజలందుకుంటున్నారు.  ఓరుగల్లు రాజధానిగా పాలించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో అద్భుత శిల్పాలతో మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారని ప్రచారంలో ఉంది.  పదడుగుల ఎత్తులో దేవేరుల సమేతంగా కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాలూ, విశాల మండపాలూ, రాతి ప్రాకారాలూ భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి.  కాకతీయుల పరిపాలనలో అయ్యన్నదేవుడు మంత్రిగా ఉన్న కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు  చెబుతారు.  అయ్యన్నదేవుడి వల్ల ఈ ఊరుకి అయ్యన్నవోలు అనే పేరువచ్చిందని.. ఇది క్రమంగా అయినవోలు... ఐనవోలుగా మార్పు చెందిందని అంటారు. ఐనవోలు ఆలయం ఆకాశమార్గంగా చూస్తే రథాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో  ప్రదక్షిణ చేసుకునేందుకు వీలుగా  నిర్మాణం ఉండడంతో ఇది  చాళుక్యుల శైలి అని  చెబుతున్నారు కొందరు చారిత్రకారులు. 
చారిత్రక శైవక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం అభివృద్ధికి  ఆమడ దూరంలో ఉంది. ఆలయ డెవలప్ మెంట్  కోసం కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ...  భక్తులకు మౌళిక దుపాయాలు శాశ్వత నిర్మాణ పనులు చేయాలని నిర్ణయించారు ప్రజాప్రతినిదులు,అధికారులు. ఏడాదైనా హామీలు నెరవేరలేదు. మరోసారి జాతర సమీపిస్తున్నా కనీస సదుపాయాలు లేవు.   
ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్టజెప్పాలన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. అయితే దూర ప్రాంతాలనుంచి వచ్చే  భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. దాతల సహకారంతో గదుల నిర్మాణం జరుగుతోంది. ముప్పై వసతి గృహాలను శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. 12 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  గెస్ట్ హౌజ్ లు,  వసతి గృహాలు,  మంచినీరు, టాయిలెట్స్ వంటి సదుపాయులు కల్పించాలంటున్నారు భక్తులు.

ఆలయ అభివృద్ధి పనులపై గత ఏడాది డిసెంబర్ 26న జాతర కు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తులకు మౌళిక దుపాయాలు, ఆళయ అభివృద్ది పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించారు.ఏడాదైనా హామీలు నెరవేరలేదు. కల్యాణ కట్ట , సరిపడా స్నానపు గదులు, కోనేరు నిర్మాణం దేవస్థానం ముఖద్వారంలో రాజగోపురం నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం కుడా  నుంచి 3 కోట్లతో రాతి ప్రహరీ గోడ, 2 కోట్లతో రోడ్లు ,డివైడర్లు,డ్రైనేజీ లు, 75 లక్షల తో అన్నదాన సత్రం, 3 కోట్ల తో 41 గదుల "మల్లన్న సదన",  40 లక్షల తో కాకతీయ తోరణాల నిర్మాణం,50 లక్షలతో హైమాక్స్ లైట్స్,50 లక్షల తో ప్రహరీ లోపల బండ, గచ్చు పనులు.. ఇలా మొత్తం 20 కోట్లతో పనులు జరుగుతున్నాయి.   స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఐనవోలుకు డబుల్ రోడ్డు,  70 లక్షలతో ఆలయం పశ్చిమ వైపున  వెంకటాపుర్ - గరిమళ్లపల్లి రహదారి అనుసంధానం, సీసీ రోడ్లతో ఐనవోలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ప్రజాప్రతినిధులు.  మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం కోసం 50 లక్షలు కేటాయిస్తామని గ్రేటర్ కార్పొరేషన్ పాలకవర్గం హామీలు ఇచ్చినా పనులు పూర్తికాలేదు. కుడా ఆధ్వర్యంలో  నాలుగు దిక్కులా సులబ్ కాంప్లెక్సులు నిర్మిస్తామని కోటి నిధులు కేటాయించి ఏడాదిలో పనులు పూర్తిచేస్తామని చెప్పారు. గత ఏడాది జాతర తర్వాత పనులు మొదలుపెడతామని, 2022 జాతరకు అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యపూరం దాల్చలేదు. తాజాగా మరోసారి రివ్యూ చేసిన  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఈ పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. జాతర కు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ హనుమంతు ఆదేశించారు. ఈ సారి మేడారం జాతర కూడా ఉండటంతో భక్తులు ముందుగా వనదేవతలను దర్శించుకొని తర్వాత ఐనవోలుకు బ్రహ్మోత్సవాలకు వస్తారని చెబుతున్నారు అధికారులు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలంటున్నారు గ్రామస్థులు. పనులను స్పీడప్ చేయాలని కోరుతున్నారు.