రాంచీ: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి అసలు చర్చకే తావు లేనది బ్యాటింగ్ కోచ్ సిటాన్షు కోటక్ స్పష్టం చేశాడు. కోహ్లీ అద్భుతమైన ఫామ్, అత్యున్నత ఫిట్‌నెస్‌తో రాణిస్తున్న నేపథ్యంలో అతని వన్డే భవిష్యత్తు గురించి చర్చించడం, ముఖ్యంగా 2027వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని ఊహాగానాలు చేయడం పూర్తిగా అనవసరమని అన్నాడు. రాంచీలో సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో జట్టును గెలిపించాడు. వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ చేసి తన సత్తా తగ్గలేదని నిరూపించాడు.
‘కోహ్లీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తను ఇలాగే ఆడుతున్నంత కాలం, అతని భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన పనే లేదు’ అని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, కోహ్లీను చూసి యంగ్ క్రికెటర్లు ఎంతో నేర్చుకుంటున్నారని చెప్పాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం 2027 వరల్డ్ కప్ గురించి కాకుండా రాబోయే మ్యాచ్‌ల్లో ప్లేయర్లకు అప్పగించే బాధ్యతలు, ఆటపైనే దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేశాడు.
