తమిళ్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఊరట

తమిళ్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఊరట

చెన్నై: తమిళనాడు పాలిటిక్స్‎లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026, మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ భారీ ఊరట కల్పించారు. టీవీకేకు ఓటేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మంగళవారం (జూన్ 9) కొట్టివేశారు. దీంతో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

2026, ఏప్రిల్‎లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. కానీ విజయ్‏కు 108 సీట్లు రావడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. విజయ్ ప్రభుత్వానికి మద్దతు విషయంలో అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలింది.

 సీనియర్ నేతలు సీవీ. షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేసి విశ్వాస పరీక్షలో విజయ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో విజయ్ టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో సునాయసంగా నెగ్గింది. అయితే, పార్టీ విప్ ధిక్కరించి టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పీకర్‎కు ఫిర్యాదు చేశారు. 

►ALSO READ | ఉజ్వల గ్యాస్ కస్టమర్లకు బిగ్ షాక్! ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ! మారిన రూల్స్ ఇవే!

ఈ పిటిషన్లను విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వివరణతో ఏకీభవించారు. టీవీకేకు ఓటేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ అందించగా..  పళనిస్వామికి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలించింది. స్పీకర్ నిర్ణయంపై అన్నాడీఎంకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలీ.