ఎండుకపోతున్న పిల్లలు: అంగన్​వాడీల్లో గుడ్లు లేవ్ పాలు లేవ్

ఎండుకపోతున్న పిల్లలు: అంగన్​వాడీల్లో గుడ్లు లేవ్ పాలు లేవ్

పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందని పోషకాల ఫుడ్డు సెంటర్లకు రెండు, మూడు నెలలుగా పాలతోపాటు నూనె బంద్ -పప్పు, బాలామృతం, మురుకుల సప్లయ్ అంతంత మాత్రమే టెండర్లు ఫైనల్ చేయడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం.

మంచిర్యాల/ నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీ సెంటర్లలోని చిన్న పిల్లలు నెలల తరబడి పాలు లేక అల్లాడుతున్నారు. పోషకాల ఫుడ్డు అందక ఎండుకపోతున్నారు. రోగాల బారిన పడుతున్నారు. గర్భిణులు, బాలింతల పరిస్థితీ ఇట్లనే ఉంది.  ముఖ్యంగా రూరల్​ ఏరియాల్లోని గర్భిణులు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. వారందరికీ టైమ్​కు పోషకాల ఫుడ్డు అందించాల్సిన అంగన్​వాడీ సెంటర్లలో సరుకులు ఉండటం లేదు. చాలా సెంటర్లకు రెండు మూడు నెలలుగా పాలు, నూనె  బందైంది. కందిపప్పు, గుడ్లు, మురుకులు, బాలామృతం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. వచ్చిన ఆ కొద్ది సరుకుల్లో కూడా క్వాలిటీ ఉండటం లేదు.

సర్కారు ఇచ్చే రేట్లకు సప్లయ్​ చేయలేక..

రాష్ట్రంలో 99 రూరల్, 25 అర్బన్, 25 ట్రైబల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్​వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. ఈ సెంటర్లకు హాకా(హైదరాబాద్​ అగ్రికల్చర్​ కోఆపరేటివ్ అసోసియేషన్​) ద్వారా పాలు, కంది పప్పు, మురుకులు సప్లయ్​ చేస్తుంటారు. టీఎస్​ ఆయిల్​ ఫెడ్​ ద్వారా విజయ గ్రౌండ్ నట్​ ఆయిల్​, మరో సంస్థ ద్వారా బాలామృతం సరఫరా జరుగుతుంటుంది. రెండు నెలల కిందట మిల్క్​ టెండర్ గడువు ముగిసింది. కొత్త టెండర్​ను ఖరారు చేయడంలో సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా స్టేట్​వైడ్​ అంగన్​వాడీ సెంటర్లకు పాల సప్లయ్​ నిలిచిపోయింది. రేట్లు ఎక్కువగా కోట్ చేశారనే కారణంతో రీ టెండర్లు పిలిచారు.

ఎండుకపోతున్నరు

ఈ  ఫొటోలో కనిపిస్తున్న బాబు పేరు.. మడావి రాంతేజ్. వయసు నాలుగేండ్లు. ఊరు.. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణి మండలం చింతపల్లి. నాలుగేండ్ల వయసులో  కనీసం 12 నుంచి 16 కిలోల బరువు ఉండాల్సిన రాంతేజ్​.. కేవలం 9 కిలోలే ఉన్నడు. అలాగే వయసుకు తగ్గ హైట్​ కూడా లేడు. ఇలాంటి చిన్నపిల్లలకు ప్రతిరోజూ గ్లాసు పాలు, పప్పు కూర, కోడిగుడ్డుతో భోజనం, 20 గ్రాముల స్నాక్స్, బాలామృతం అందించాలి. జిల్లాలోని అంగన్​వాడీ సెంటర్లకు మూడు నెలలుగా పాలు , నూనె మొత్తానికే రావట్లేదు. పప్పులు, స్నాక్స్, ఎగ్స్​ సక్కగా వస్తలేవు. దీంతో రాంతేజ్ ​లాంటి పిల్లలు పోషకాల ఫుడ్డు అందక ఇట్ల బక్కచిక్కుతున్నరు. జిల్లాలో ఏడు నెలల నుంచి 6 ఏండ్లలోపు పిల్లల్లో ఏకంగా 953 మంది సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నట్లు ఐసీడీఎస్​ ఆఫీసర్లే చెప్తున్నరు. మూడు నెలల సంది పాలు లేవు

                                                                                                                    – ఆత్రం యశోద, బాలింత, ఇర్కపల్లి, ఆసిఫాబాద్​ జిల్లా

మమ్ముల బద్నాం చేస్తున్నరు..

ప్రభుత్వం నాలుగు నెలల నుంచి పాలు,ఆయిల్ సప్లయ్​ చేస్తలేదు. పిల్లలకు పంచే సరుకులు మేం తింటున్నమని పేరెంట్స్ మమ్మల్ని బద్నాం చేస్తున్నరు. కోడి గుడ్లు కూడా సరిపడా రావడంలేదు. ఆఫీసర్లను అడిగితే వస్తాయని చెప్తున్నరు.  ప్రతీ నెల ఇదే పరిస్థితి. నెలకు రెండు సార్లు సగం సగం సామాన్లు వస్తున్నయ్. ఓసారి కొందరికి, మరోసారి ఇంకొందరికి ఇయ్యాల్సి వస్తోంది. సామాన్లన్నీ ఒకేసారి వచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.                                                                                                                  – కళావతి, అంగన్​వాడీ కార్యకర్త, దండేపల్లి

ప్రభుత్వం లీటరు పాలకు రూ. 39.63 చెల్లిస్తోంది. ఈ రేటు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. కానీ సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే  లాక్​డౌన్ నుంచి ఓపెన్​ మార్కెట్​లో ఆయిల్​ రేటు లీటర్​కు ఇరవై ముఫ్పై రూపాయల దాకా పెరిగింది. ప్రభుత్వం మాత్రం పాత రేట్ల ప్రకారమే రూ. 106.40 చొప్పున చెల్లిస్తోంది. దీంతో ఆయిల్​ ఫెడ్  చేతులెత్తేసింది. దీంతో  మిల్క్​, ఆయిల్​ సప్లయ్​ నిలిచిపోయింది.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి…!

ఆదిలాబాద్ జిల్లాలో పాలు, పప్పు, బాలామృతం ఒక నెల వస్తే మరో నెల రావడం లేదు. ప్రస్తుతం నెలరోజులుగా ఇవి అందుబాటులో లేవు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో వస్తాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో రెండు నెలల నుంచి, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో నాలుగు నెలల నుంచి పాలు, నూనె రాలేదు.

వరంగల్​ అర్బన్​, రూరల్​, ములుగు జిల్లాల్లో రెండు నెలలుగా, మహబూబాబాద్​ జిల్లాలో మూడు నెలలుగా మిల్క్​ సప్లయ్​ నిలిచిపోయింది. రూరల్​ జిల్లాలోని చాలా సెంటర్లకు కోడిగుడ్లు సగం కోటా మాత్రమే వచ్చాయి. మహబూబాబాద్​లో నెల నుంచి కందిపప్పు రాలేదు. భూపాలపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో నెల రోజుల నుంచి, నారాయణపేట జిల్లాలో మూడు నెలల నుంచి పాలు బంద్​ అయ్యాయి. నల్గొండ  జిల్లాలో పాలు, గుడ్లు సరిగా సప్లయ్​ కావడం లేదు. దేవరకొండ ప్రాజెక్టు పరిధిలో 283 సెంటర్లకు డిసెంబర్ నుంచి పాలు, జనవరి 15 నుంచి గుడ్లు సప్లయ్​ కాలేదు. యాదాద్రి జిల్లాలో 3 నెలల నుంచి పాలు, నూనె రాలేదు. సూర్యాపేట జిల్లాలో 2 నెలల నుంచి మిల్క్​ సప్లయ్​ ఆగింది.

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొన్ని సెంటర్లకు అక్టోబర్​ వరకు, మరికొన్ని సెంటర్లకు డిసెంబర్ వరకు మిల్క్​ సప్లయ్​ చేశారు. 2 నెలలు పప్పు క్వాలిటీ లేదని రిటర్న్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నెలలో రెండుసార్లు గుడ్లు పంపిణీ చేయాలి. కానీ ఒకేసారి ఇస్తున్నారు. మూడు నెలల నుంచి పప్పు, పాలు, ఆయిల్​, మురుకులు రావడం లేదు. ఖమ్మం జిల్లాలో బాలామృతం నవంబర్​, డిసెంబర్​ నెలల్లో రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనవరిలో పాలు, బాలామృతం, మురుకులు అందలేదు.

మంత్రికి చెప్పినా నో యూజ్

ఉమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ మినిస్టర్​ సత్యవతి రాథోడ్​ ఇటీవల ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన సందర్భంగా పలువురు అంగన్​వాడీ టీచర్లు సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరిస్తానని మంత్రి చెప్పి వారమవుతున్నా ఇప్పటికీ ప్రోగ్రెస్​ లేదు.

క్వాలిటీలేని గుడ్లు, పప్పు

వచ్చే సరుకులు అంతంతే. అందులోనూ క్వాలిటీ ఉండట్లేదు. కరోనా స్టార్టయినప్పటి నుంచి అంగన్​వాడీ సెంటర్లు క్లోజ్​ చేసి ఉండటంతో సరుకులను ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. ఇదే అదనుగా  కొందరు కాంట్రాక్టర్లు గుడ్లు, కంది పప్పు సరఫరాలో కోతలు పెడుతున్నారు. కోడిగుడ్ల  టెండర్లు జిల్లాల్లోనే జరుగుతాయి. వీటిని నెలకు మూడుసార్లు అంగన్​వాడీలకు సప్లయ్​ చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లే ఇస్తున్నారు. జనవరి ముగుస్తున్నా కొన్ని జిల్లాల్లో రెండో విడత సప్లయ్​ చేయలేదు. గుడ్డు​ బరువు 50 గ్రాముల కంటే తక్కువ ఉండరాదు. కానీ 40 నుంచి 45 గ్రాములే ఉంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. కందిపప్పు  కూడా క్వాలిటీ ఉండడం లేదు.

పాలు, నూనె వస్తలేవు

అంగన్​వాడీ సెంటర్లకు పాలు, నూనె వస్తలేవు. మురుకులు కూడా ఇస్తలేరు.  గుడ్లు చిన్న సైజులో వస్తున్నయ్. ఒక నెల ఇస్తే ఇంకో నెల ఇస్తలేరు. మేడమ్​లను అడిగితే పైనుంచే వస్తవలేవని చెప్తున్నరు. – లక్ష్మీ, నెన్నెల, మంచిర్యాల జిల్లా

టెండర్లు ఫైనల్ కాలేదు..

అంగన్​వాడీలకు 2 నెలల నుంచి పాలు, నూనె రావడం లేదన్నది నిజమే. హాకా మిల్క్​ టెండర్​ పూర్తయింది. మళ్లీ టెండర్లు పిలిచాం. రేట్ల దగ్గర లేటవుతోంది. ఆయిల్​ రేట్లు పెరగడంతో టీఎస్​ ఆయిల్​ ఫెడ్​ సప్లయ్​ నిలిపివేసింది.  – రౌఫ్​ఖాన్​, డీడబ్ల్యూవో మంచిర్యాల