
సాధారణంగా బాగా చదివేవాళ్లు మంచి జాబ్ సాధించి లైఫ్‌లో సెటిల్ కావాలి అనుకుంటారు. కానీ.. చదువులో ఎప్పుడూ ముందుండే సిద్ధార్థ్ యాదవ్ మాత్రం యూట్యూబర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. అనుకున్నట్టుగానే యూట్యూబ్ చానెల్ పెట్టాడు. ఆకట్టుకునే కంటెంట్‌తో అందర్నీ అలరించాడు. చూస్తుండగానే ఫేమస్ సెలబ్రిటీ అయిపోయాడు. అలా వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి, టైటిల్ గెలుచుకుని లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
సిద్ధార్థ్ యాదవ్ 1997 సెప్టెంబర్ 14న హర్యానాలో రామ్ అవతార్ యాదవ్, సుష్మా యాదవ్ దంపతులకు పుట్టాడు. అతని అసలు పేరు సిద్ధార్థ్ యాదవ్ అయినా తన చానెల్ ‘‘ఎల్విష్ యాదవ్’’ పేరుతోనే ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ్ ఎక్కువగా కామెడీ కంటెంట్ చేస్తుంటాడు. తన స్కిల్స్‌తో హిందీతో పాటు తెలుగు భాషలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. కంటెంట్ క్రియేటర్‌గానే కాదు రియాలిటీ టీవీ స్టార్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
ఎప్పుడూ టాపరే
సిద్ధార్థ్ గుర్గావ్‌లోని ఎమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ప్లస్ టూ 94 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా పొందాడు. అయితే.. కాలేజీ రోజుల్లోనే అతనికి యూట్యూబర్ కావాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే ఇండియాలో ఆశిష్ చంచలాని, హర్ష్ బెనివాల్, అమిత్ బదానా లాంటి చాలామంది యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యారు. వాళ్ల కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూసే సిద్ధార్థ్ కూడా వాళ్లలాగే ఫేమస్ కావాలని నిర్ణయించుకున్నాడు.
నవ్వించే కంటెంట్‌తో
సిద్ధార్థ్ 2016లో ‘‘ఎల్విష్ యాదవ్” పేరుతో చానెల్ పెట్టాడు. అప్పట్లో ఎక్కువగా లవ్, ఫ్రెండ్‌షిప్, స్టూడెంట్ లైఫ్ మీద కామెడీ వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అతని కంటెంట్‌లో సామాజిక అంశాలు, యువత సమస్యలను ఎక్కువగా చూపించడంతో యూత్‌కి దగ్గరయ్యాడు. అతని వీడియోల్లో చెప్పే జీవిత అనుభవాలు కేవలం నవ్వు తెప్పించేవే కాదు.. యువతకు విలువలు, సామాజిక బాధ్యతలు కూడా నేర్పుతాయి.
షార్ట్ కట్స్ లేవు
సిద్ధార్థ్ ఎప్పుడూ షార్ట్‌కట్‌లో సక్సెస్ కావాలనే ప్రయత్నం చేయలేదు. వైరల్ కావాలనే ఉద్దేశంతో తన కంటెంట్‌లో ఏది పడితే అది చూపించలేదు. అంతెందుకు అందరు కంటెంట్ క్రియేటర్లు షార్ట్ ఫార్మాట్ వీడియోలు(షార్ట్స్) చేస్తున్నా సిద్ధార్థ్ మాత్రం చేయడం లేదు. మొదట్లో రెండు మూడు నిమిషాలు ఉండే కామెడీ స్కిట్ వీడియోలు చేశాడు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పెద్ద వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే ‘బంటయ్’ పేరుతో చేసిన వీడియోతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా సిద్ధార్థ్‌ని అభిమానించేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2018లో అతని వీడియోలు రెగ్యులర్‌గా ట్రెండింగ్‌లో ఉండేవి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. అప్పటినుంచి ఫ్లాష్ ఫిక్షన్, కాన్సెప్చువల్ షార్ట్ ఫిల్మ్‌లు, కామెడీ రోస్ట్‌లపై దృష్టి పెట్టాడు. కొన్నాళ్లపాటు టిక్‌టాక్‌లో కూడా వీడియోలు చేశాడు.
మరో చానెల్
ఎల్విష్ యాదవ్ చానెల్‌కు 15.7 మిలియన్ల మంది సబ్‌స్క్రయిర్లు ఉన్నారు. అందులో ఇప్పటివరకు 195 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. వాటిలో కేవలం రెండు మాత్రమే షార్ట్ వీడియోలు. మిగతావన్నీ పెద్ద వీడియోలే. అయినా.. మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ‘భాయ్ బెహెన్ ఔర్ స్కూల్’ పేరుతో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోకి ఏకంగా 77 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘స్కూల్ లైఫ్ దెన్ వర్సెస్ నౌ’ వీడియోకు 36 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
20 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చానెల్‌లో చాలానే ఉన్నాయి. 2019లో సిద్ధార్థ్ రెండో చానెల్ ‘ఎల్విష్ యాదవ్ వ్లాగ్స్’ని మొదలుపెట్టాడు. అందులో వెయ్యికి పైగా వీడియోలు అప్‌లోడ్ చేసినప్పటికీ షార్ట్ వీడియోలు రెండు మాత్రమే ఉన్నాయి. ఈ చానెల్‌కు 8.56 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇందులో డైలీ వ్లాగ్స్, సినిమా రోస్ట్‌లు లాంటివి చేస్తున్నాడు. 2023లో అతను ‘ఎల్విష్ యాదవ్ గేమింగ్’ పేరుతో మూడో చానెల్ కూడా పెట్టాడు.
ఎంట్రప్రెన్యూర్‌గా..
కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ అయిన తర్వాత సిద్ధార్థ్ బట్టల బ్రాండ్ ‘సిస్టమ్ క్లాతింగ్’తో ఎంట్రప్రెన్యూర్‌గా మారాడు. ‘ఎల్విష్ యాదవ్ ఫౌండేషన్’ అనే ఎన్జీవోని కూడా స్థాపించాడు. దీని ద్వారా పేద పిల్లలకు విద్య, ఉచిత భోజనం లాంటివి అందిస్తున్నాడు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, పెప్సీ లాంటి బ్రాండ్స్‌తో కొలాబరేషన్స్, యూట్యూబ్, ప్రమోషన్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. కేవలం యూట్యూబ్ ద్వారా సంవత్సరానికి రూ. 2–3 కోట్లు సంపాదిస్తున్నాడని అంచనా.
బిగ్‌బాస్‌తో మరింత ఫేమస్
సిద్ధార్థ్ 2023లో ‘బిగ్ బాస్ ఓటీటీ–2’ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. అతని వ్యక్తిత్వం, మాటలతో అందర్నీ కట్టిపడేశాడు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లి ఈ షోలో గెలిచిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ తర్వాత టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (2023), ప్లే గ్రౌండ్ సీజన్–4 (2023), లాఫ్టర్ చెఫ్స్ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్–2 (2025) లాంటి రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు.