- అది మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేరు
- కార్మికులు రోడ్డున పడుతమంటే పడుండ్రి.. ఎవరేం జేస్తరు
- అమాయకులైతే జాయినింగ్‌కు దరఖాస్తు పెట్టుకోవాలె
- తిన్నదరగక సమ్మె చేస్తున్నరు
- ఒక్క సంతకంతో 7 వేల ప్రైవేటు బస్సులు దింపుత
- సంస్థనే పోతుంటే.. ఇక యూనియన్లు ఎక్కడివి?
- భూగోళం ఉన్నంతకాలం విలీనం జరగదు
- ఏపీలో ఇంక మన్ను కూడా అవలె
- హైకోర్టు ఏం చేస్తది.. కొడుతదా?
- ఆర్టీసీకి ఏడాదికి రూ. 900 కోట్లు ఇస్తున్నం
- హైర్ బస్సులతో లాభాలు.. ఆర్టీసీ బస్సులతో నష్టాలేంది?
ఏం సమ్మెనండీ ఇది. అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెనా.. తిన్నదరగక జేసే సమ్మెనా? మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ ఇట్ల చెయ్యడు. ఆర్టీసీ సమ్మె ముగింపెక్కడిదండీ.. ఇక ఆర్టీసీనే ముగుస్తుంటే. ఎస్.. ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా.. వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే జవాబు. అది మునగకతప్పదు.. ఎవ్వరు కూడా కాపాడలేరు. అయిపోయింది. మా సంస్థ మేమే సంపుకుంటం. మా విషం మేమే తాగుతం అంటే ఎవడూ కాపాడలేడు. మా అంతల మేము రోడ్డున పడుతమంటే పడుండ్రి.. ఎవరేం జేస్తరు?
ఎవడు పడితే వాడు వచ్చి ఆర్టీసీని గవర్నమెంట్ల కలుపమంటే కలుపుతరా? అంత ఈజీనా? తెలివితక్కువ నినాదం పట్టుకొని ముందుకు పోవుడేంది? అదొక నినాదమా..? నువ్వు దిగిపో నాకు సీఎం సీటు ఇవ్వు అంటే ఇస్తరా? మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుండ్రి అంటే కలుపుతారా?
ఇది 100 శాతం అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలం ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం జరిగేది కాదు. ఐదారు రోజుల్లో వందకు వంద శాతం నిర్ణయం తీసుకుంటం. ఒక మీటింగ్‌తో, ఒక్క సంతకం పెట్టి ఆర్డర్ చేస్తే విత్ ఇన్ మూడు నాలుగు రోజుల్లో ఆరేడు వేల ప్రైవేటు బస్సులకు పర్మిట్ ఇచ్చేయొచ్చు. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు:
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిన్నదరగక సమ్మె చేస్తున్నారని, కార్మికుల జీవితాలతో యూనియన్లు ఆటలాడుకుంటున్నాయని, యూనియన్ నేతలది బలుపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎంగా చెప్తున్నానని, వెయ్యి శాతం ఇక పాత ఆర్టీసీ ఉండదని, ఒక్క సంతకంతో 7వేల ప్రైవేటు బస్సులను దింపుతామని ప్రకటించారు. ఆర్టీసీని యూనియన్లు ముంచుతుంటే ప్రభుత్వం ఎట్లా కాపాడుతుందని ప్రశ్నించారు. ‘‘సమ్మె ముగింపు ఎక్కడిదండీ. ఆర్టీసే ముగుస్తున్నది. దాన్ని ఈ ప్రపంచంలో ఎవడూ కాపాడలేడు. సంస్థనే పోతుంటే విలీనం ఎక్కడిది? భూగోళం ఉన్నంతకాలం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరుగదు” అని పేర్కొన్నారు. ఐదారు రోజుల తర్వాత ఆర్టీసీపై ఫైనల్ నిర్ణయం ఉంటుందన్నారు. కార్మికులు రోడ్డున పడితే పడని, ప్రభుత్వానికేందని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్ అని, నోటీసులు ఇవ్వగానే తెల్లారే దుంకుతారా ఏంది? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథా అని, అనవసరమైన, అర్థంపర్థం లేని, దురహంకార పూరితమైన పద్ధతులు అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీకి సంబంధించి తనకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రంలో వేరొకరు ఉండరని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు
ఆర్టీసీ సమ్మె ముగింపెక్కడిదండీ.. ఇక ఆర్టీసే ముగుస్తుంది. ఎస్.. ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇట్‌ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటారా.. ఆర్టీసీ వాళ్లకు ఇప్పుడు రూ. 5వేల కోట్ల అప్పులున్నయి. వీళ్లు(యూనియన్లు) వకీళ్లను పెట్టి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. పీఎఫ్ సొమ్ము గవర్నమెంట్ తీసుకుంటదా? ఎవలూ తీసుకోలే.. ఆర్టీసీ సంస్థకు దమ్ము లేదు. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి ఆ సంస్థకు లేదు. ప్రావిడెంట్ ఫండ్చెల్లించే పరిస్థితీ లేదు.. వాళ్ల స్టోర్స్‌లో ఉన్న డబ్బులను యాజమాన్యం వాడుకున్నది.. వాటిని ఇచ్చే పరిస్థితీ లేదు. దీనికి కారణం నష్టాలు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే జవాబు. ఈ సమ్మె ఫలితం ఏమిటంటే.. వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు. పాత ఆర్టీసీ యాజిటీజ్‌గా బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లు, రాజకీయ పార్టీలే చేసినయ్. ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్టకట్టదు. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్న. నాకు ఆర్టీసీ డ్రైవర్లతోటి, కండక్టర్లతోటి పంచాయితీ లేదు. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్‌గా పనిచేస్తే రెండేండ్లలో వాళ్లు కూడా లక్ష రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తది. యూనియన్ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నరు.
50వేల జీతం.. ఏం తమాషానా?
నేను ముఖ్యమంత్రి అయినంక మన సెక్రటేరియెట్‌లో జాగ లేకుంటే.. వైశ్రాయి హోటల్లో ఆర్టీసీ డీఎంలు, సూపర్వైజర్లు, ఈడీలు, ఆ సంస్థ అధికారులతో ఒక రోజంతా గడిపిన. దేశంలో ఏ సీఎం పెట్టలే ఇట్ల మీటింగ్. వాళ్లతో ఒక దినమంతా గడిపి మొత్తం సలహాలు చెప్పి ఆర్టీసీ కార్మికులకు 44 శాతం సాలరీలు పెంచిన. కష్టపడి పనిచేయమన్న. మళ్ల తర్వాత ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మాకు ఐఆర్ పెంచాలంటే 14శాతం ఐఆర్ ఇచ్చినం. రెండు సార్లు పెంచినదాన్ని బట్టి 67శాతం కార్మికుల జీతాలు పెరిగినయి. దేశ చరిత్రలో కానీ, ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో కానీ నాలుగేండ్లలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినట్లు ఉందా? ఇక్కడ పెంచినం. ఇంకా మేము గొంతెమ్మ కోర్కెలు కోరుతం అంటే.. అర్థం ఉంటదా? నాలుగేండ్లలో 67శాతం సాలరీ హైక్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలుంటయ్ మీకు. ఏం తమాషానా? సమాజంలో చాలా మందికి లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ సాలరీ 50వేలు వస్తది. బయట 5వేల రూపాయల జీతం లేనోడు కూడా ఉన్నడు. అన్నమో రామచంద్ర అని రోడ్లు పట్టుకొని తిరిగెటోళ్లు ఉన్నరు. నీకు 50వేల జీతం దొరికినప్పుడు సంస్థని కాపాడుకోవాలి కదా? బాధ్యత లేదా? సందర్భం వస్తే ఒక గంట ఎక్కువ పనిచేయవా? మా కాళ్లు మేమే నరుక్కుంటమంటే.. ఏమైంది? ఆర్టీసీ మునగకతప్పదు.. ఎవ్వరూఆర్టీసీని కాపాడలేరు. అయిపోయింది.
గవర్నమెంట్ల ఎట్ల కలుపుతరు?
ఎవడు పడితే వాడు వచ్చి ఆర్టీసీని గవర్నమెంట్ల కలుపమంటే కలుపతరా? అంతా ఈజీనా? ఎవర్ని మోసం చేస్తరు? రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నయి.. ఆర్టీసీని కలిపితే రేపు పొద్దున మరో కార్పొరేషన్ అట్లనే అంటది. ఇష్టమున్నట్లు మాట్లాడుడేనా? రోడ్లమీద పడి ఎటుపడితే అటు మాట్లాడుడేనా. గవర్నమెంట్ అంటే బాధ్యతుంటది… పద్ధతుంటది. మిగతా కార్పొరేషన్లు ప్రభుత్వంలో కలుపమని దరఖాస్తు పెడితే ఏం చేయాల? ఇవే కోర్టులు ఆర్డరిస్తయి.. ఆర్టీసీని కలిపినవు వీటినెందుకు కలుపవని అంటయి. అప్పుడేం సమాధానం చెప్పాల? ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలనే అసంబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, తెలివితక్కువ నినాదం పట్టుకొని ముందుకు పోవుడేంది? అదొక నినాదమా అండీ.. నాకు అర్థం కాదు. నువ్వు దిగిపో నాకు సీఎం సీటు ఇవ్వు అంటే ఇస్తరా? మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుండ్రి అంటే కలుపుతారా? ఇది 100 శాతం అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం జరిగేది కాదు.
ప్రతిపక్షాలు తలకాయ మాసినోళ్లు
పిచ్చి పనికిమాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మాసిపోయినోడు.. నెత్తిమాసిపోయినోడు గీళ్లా మాట్లాడేది? అర్థం ఉండాలె కదా? పదిమంది దొరికినకాడ జెండా పాతొచ్చని తిరుగుతున్నరు. ఇదా రాజకీయం..? దీన్నంటరా రాజకీయం? బాధ్యతగల్ల ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా ఇది. అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? ఈరోజు దేశంలో ఆర్టీసీని అన్ని రాష్ట్రాలు తీసి పారేసినయ్. మధ్యప్రదేశ్‌లో లేదు.. ఛత్తీస్‌గడ్‌లో లేదు.. జార్ఖండ్‌లో లేదు.. వెస్ట్ బెంగాల్లో లేదు. సీపీఎం నాయకులు ఈడ కూసుండి నరుకుతున్నరు. మరి వెస్ట్ బెంగాల్లో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం జేసిండ్రు.అక్కడ ఎవడు మూసిండ్రు ఆర్టీసీని. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని మూసిందెవడండీ..? కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ సీఎంగా ఉన్నప్పుడు కాదా?. బీజీపోళ్లు బాగా ఉపన్యాసాలు చేప్తుండ్రు కదా.. వాళ్ల రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేసిండ్రా? కాంగ్రెస్ గవర్నమెంట్లు నాలుగున్నయ్.. ఆడ చేస్తున్నరా? ఎందుకు చేస్తలేదు.
అద్దె బస్సులతో లాభం..
ఆర్టీసీలో యాడాదికి 1200 కోట్ల నష్టాలు వస్తున్నయి. అంటే నెలకు వంద కోట్ల నష్టం. హైదరాబాద్‌లో ఎన్ని ట్రావెల్స్ నడుస్తయో తెలుసు కదా.. జబ్బార్, గంగినేని, కేశినేని, దివాకర్ ట్రావెల్స్.. ఈ ట్రావెల్స్ లాభాల్లో ఉంటయ్ ఎట్ల? నువ్వు(ఆర్టీసీ) మునుగుతవెట్ల? వాడు ఆపరేటరే.. నువ్వు ఆపరేటరే కదా! ఆర్టీసీలో 2100 హైర్ బస్సులు (అద్దె బస్సులు) ఉన్నయి. ఆర్టీసీవి 8వేల చిల్లర బస్సులుంటయి. ప్రైవేటు బస్సుల మీద (హైర్ బస్సులు).. ప్రతి కిలోమీటర్‌కు ప్రతి బస్సుకు 75 పైసల లాభం ఆర్టీసీకి వస్తది. వెరసి రోజుకు ఒక హైర్ బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతది. ఇట్ల రోజుకు ఒక ప్రైవేటు హైర్ బస్సు మీద 225 రూపాయలు బెనిఫిట్ వస్తది. ఆ లెక్కన ప్రతి రోజు నాలుగు లక్షల 72వేలు పైచీలుకు లాభం వస్తది. 8వేల ఆర్టీసీ బస్సులు ఉంటే… ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్‌కు 13 రూపాయల నష్టం వస్తది. ఇక్కడ(హైర్ బస్సులతో) బారాన లాభం వస్తది.. అక్కడ (ఆర్టీసీ బస్సులతో) 13 రూపాయల నష్టం వస్తది. ఏం కారణం..? ఎందు వల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులకు నేర్పే విద్య? రోజుకు రూ. 3కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇదీ పరిస్థితి.
మీరు ముంచుతరు, మేం కాపాడాల్న?
వీళ్ల డిమాండ్లు ఏంటో తెలుసా? అద్దె బస్సులు తొలగించాలట. అంటే నిండముంచాల్నా? సిటీలో టైమ్ప్రకారం బస్సులు నడపాలట. అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాల్నట. అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతం.. నువ్వు కాపాడు అంటరు. ఎట్ల?
ఏడాదికి రూ. 900 కోట్లు ఇస్తున్నం
టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఐదేండ్లలో అప్పటి గవర్నమెంట్ ఆర్టీసీకి ఇచ్చింది రూ. 712 కోట్లు. టీఆర్ఎస్ వచ్చినంక ఇచ్చింది రూ. 4250 కోట్లు. అంటే 597 శాతం ఇంక్రీజ్ చేసినం. అదీ కాక ఒక చట్టం తెచ్చినం. అర్బన్‌లో ఆర్టీసీకి నష్టం వస్తది కాబట్టి.. నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించాలని యాక్ట్ పాస్ చేసినం. జీహెచ్ఎంసీ ఒక ఏడాది గ్రాంట్ రూ. 330 కోట్లు ఇచ్చింది. అంటే.. మేమిచ్చిన రూ. 4250 కోట్లు, జీహెచ్ఎంసీ ఇచ్చి రూ. 330 కోట్లు కలిపి మొత్తం రూ. 4550 కోట్లు ఆర్టీసీకి అందినయ్. ఇంచుమించుగా సంవత్సరానికి రూ. 900 కోట్ల పైచీలుకు ఇచ్చినం. ఇంకేమిస్తరు మీకు.. నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంటది. ఈ సంవత్సరం బడ్జెట్లో 550 కోట్లు పెట్టినం.. ఆల్రెడీ రూ. 425 కోట్లు ఇచ్చినం. సచ్చిపోతం బతుకుతం.. అని మీదపడితే రూ. 425 కోట్లు రిలీజ్ చేసినం.
నోటీస్ ఇవ్వంగనే దుంకుతరా?
పండుగల సీజన్లో ఆర్టీసీకి ఎక్కువ డబ్బులు వస్తయి. బతుకమ్మ, దసరా మన రాష్ట్రంలో చాలా ముఖ్యం. ఆర్టీసీకి రోజుకు రూ. 11 కోట్ల ఆదాయం ఉంటే.. ఈ పండుగల సీజన్లో ఇంకో రూ. 6 కోట్లు ఎక్కువ వస్తది. అంటే రోజుకు రూ. 17 కోట్లు వస్తది. బతుకమ్మ, దసరా సీజన్ మొత్తం అదనంగా రూ. 120 నుంచి 125 కోట్లు ఆర్టీసీకి వస్తయి. అలాంటి అద్భుతమైన పీరియడ్‌లో సమ్మెకు పోయిండ్రు. పనికి మాలిన డిమాండ్లేవో పెట్టిండ్రు. నంబర్ వన్ డిమాండ్ ప్రభుత్వంలో వీలినం చేయమన్నరు. మేము స్పందించినం.. కమిటీ వేసినం. ఇంకో ప్రచారం పెట్టిండ్రు బయట.. రెండునెలలాయె నోటిసిచ్చి అంటున్నరు. రెండు నెలలైతేంది.. ఇరవై నెలలైతేంది.. ఇచ్చిన తెల్లారే ఉరుకతరా ఏంది? నువ్వు నోటీస్ ఇవ్వంగనే తెల్లారే దుంకుతరా ఏంది? ఆర్టీసీని గవర్నమెంట్లో కలపమంటే అంత ఈజీ కాదు.. సమ్మెకు పోవొద్దని చెప్పినం. వినలేదు. మాకు మిగతా డిమాండ్లు ముఖ్యం కాదన్నరు. ఫస్ట్ డిమాండ్ నే పట్టుబట్టిండ్రు. డెఫినెట్‌గా ఆర్టీసీలో డబ్బులైపోయినయ్. అక్టోబర్ మొదటి వారంలో ఆర్టీసీకి రూ. 100 కోట్లు ఇచ్చినం. వాళ్లు(సంస్థ యాజమాన్యం) బ్యాంకుకు వడ్డీలు కట్టాలె.. డీజిల్‌కు కట్టాలె.. అట్ల వాటికి కట్టంగా మిగిలింది… రూ. 7 కోట్లే. గదే డబ్బున్నది ఆర్టీసీలో. సమ్మె వల్ల అదనంగా పండుగ సీజన్లో వచ్చే 120 కోట్లు పోయినయ్.. రోజు 10కోట్లు వచ్చే బదులు.. రోజుకు కోటి నష్టం వస్తాంది. రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తే రూ. 5 కోట్లు నష్టం వస్తున్నది.
మెడమీద తలకాయ ఉన్నోడు..
ఇది దురహంకారపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి.. అర్థం పర్థం లేనటువంటి, బుద్ధిజ్ఞానం లేనటువంటి సమ్మె. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ ఇట్ల చెయ్యడు. సంస్థ మనుగడ కాపాడుకోవాలన్న.. కార్మికుల జీవితాలను ఆడుకోవొద్దన్న కనీస జ్ఞానం ఉన్నోడు చేసే సమ్మె కాదిది. ఇది ఇల్లీగల్ స్ట్రయిక్. వాళ్ల మీద ఎస్మా ఉంది. ఎస్మా ఉండంగ సమ్మెకు పోయిండ్రు. సంప్రదింపులు నడుస్తున్నందున ఇల్లీగల్ స్ట్రయిక్ అని లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది. ఎవరు కాపాడుతరు మిమ్మల్ని. బ్యాంకులు కూడా ఇవ్వవు. ఇంకో తమాషా.. ఆర్టీసీలో 2600 బస్సులు రిప్లేస్మెంట్కు ఉన్నయి. అవి మార్చాల్సి ఉంది. వాటిని మార్చాలంటే 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లు కావాలి. రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు.. అవి ఎక్కడి నుంచి తెస్తరు?
ఎవడండీ వెధవ
ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్లు(యూనియన్ నేతలు) చేస్తున్నది మహా నేరం.. మహా పాపం.. అమాయక కార్మికుల గొంతు కోస్తున్నరు. ఆర్టీసీని వాళ్లే స్వయంగా ముంచుకుంటున్నరు. ముగించుకుంటున్నరు. ఎవ్వడు ఈ ప్రపంచంలో ఆర్టీసీని కాపాడలేడు. నా దృష్టిలో అది అయిపోయిన కిందే. ఇట్స్ ఏ గాన్ కేస్. అంతకన్నా ఇంకా అధ్వానమైతది వంద పర్సంట్. వాళ్లను పిలిపించి మాట్లాడింది నిజం కాదా? మాట్లాడలేదా? కమిటీని నేను అపాయింట్ చేసిన. పిలువలేదని ఎవడంటడండీ వెధవ. నేను చొరవ చూపకపోతే కమిటీ ఎట్ల వస్తది?
ఆర్టీసోళ్లే తెలంగాణ తెచ్చిండ్రా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా మంది పనిచేసిండ్రు. ఆర్టీసీ ఒక్కోళ్లే తెలంగాణ తెచ్చినట్లు చెప్పవట్టిండ్రు ఏంది? నాకు అనుబంధంగా ఉన్నోడు దొంగపనిచేస్తే ఊకుంటనా.. చట్టమంటే చట్టమే ఎవరికైనా? అఖల్ ఉంటే.. కార్మికులు తమ కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. అది ఉంటే సమ్మెకు పోతుండెనా? ఇష్టమున్నప్పుడు పోతం.. తెల్లారి మా ఇష్టం వచ్చినప్పుడు వస్తమంటే కుదురుతదా? సంస్థనా? తమాషానా? పిల్లల ఆటనా? ఒక సిస్టం ఉంటది కదా.. ఆర్టీసీలో అది లేకనే ఈ విచ్చలవిడితనం. ఆర్టీసా… బీర్టీసా కాదిక్కడ. ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత మాది.
రోడ్డున పడుతమంటే పడుండ్రి
బతకదలిచినోడు ఉంటడు.. లేనోడు పోతడు. అటువంటప్పుడు ఈ యూనియన్లు ఈ పద్ధతిలో ఇదే పనికిమాలిన అర్థరహితమైన పిచ్చిడిమాండ్లతోటి ఆర్టీసీ నడుపతమంటే జరుగదు. మా సంస్థ మేమే సంపుకుంటం. మా విషం మేమే తాగుతం అంటే ఎవడు కాపాడుతడండి మిమ్మల్ని. వీళ్ల గొంతెమ్మ కోర్కెలు ఎవరు తీర్చాల..? ఎవల్ని కాపాడుతరండి.. ఏం కాపాడుతరండి.. నో బడీ కెన్ సేవ్ ఆర్టీసీ. మా అంతల మేము రోడ్డున పడుతమంటే పడుండ్రి.. ఎవరేం జేస్తరు. మేం గొంతు కోసుకుంటం… మేం రాం.. మా సమ్మె ఆగదు.. మా డిమాండ్లు నెరవేర్చేదాకా సమ్మె ఆగదని వాళ్లు చెప్తుంటే ఏం చేయాల మేం. కార్మికులు అమాయకులైతే ఎక్కడివాళ్లక్కడికి వెళ్లి దరఖాస్తులు పెట్టుకొని డ్యూటీల జాయిన్ కావాలె.
ఎంవీ యాక్ట్ ప్రకారమే..
బీజేపీ వాళ్లది మరీ వితండ వాదం. మొన్న మోడీ ప్రభుత్వమే మోటార్ వెహికల్ అమెండ్ మెంట్ యాక్ట్‌ను పాస్ చేసింది. దీనిలో చాలా స్పష్టంగా పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్స్ ఆర్టీసీస్ అని ఉంది. దాని ప్రకారమే ముందుకు పోతున్నం. ఎనీ ప్రైవేటు పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చని చట్టంలో ఉంది. అప్పట్లో బీఎస్ఎన్ఎల్ నుంచి ఒక ఫోన్ కావాలంటే.. ఒక ఎమ్మెల్యేనైనా నాకే నాలుగు నెలలు పట్టింది. ఇప్పుడు ఫోన్లను ఎవరూ దేక్తనేలేరు.. ఒకొకరి దగ్గర మూడు మూడు ఫోన్లు ఉంటున్నయి. ప్రైవేటు కంపెనీలు వచ్చినంక ఇట్లయింది. విమానాలు అంతే. ఎయిర్ ఇండియా ఒక్కటే ఉన్నప్పుడు మోనోపోలి ఉండే. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ వచ్చినంక ఢిల్లీకి పోవాల్నంటే టైమ్‌కు టికెట్ దొరుకుతున్నది. అట్లనే ఆర్టీసీ ఉండాలి.
నాకున్న సానుభూతి ఇంకొకరికి లేదు
నాకున్న సానుభూతి, లోతైన అవగాహన ఇంకొకరికి లేదు. అప్పట్లో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో తెచ్చిన. పిచ్చోడిలెక్క తిరిగిన. మహా కష్టపడి లాభాల్లోకి తెచ్చిన. ఆర్టీసీకి సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రంలో వేరొకరు ఉంటరని అనుకోను. ఆ సంస్థ పట్ల నాకు అభిమానం ఉంది. కారణం ఏందంటే గతంలో మూడేండ్లు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ సంస్థ 13 కోట్ల 80లక్షల రూపాయల నష్టంల సంస్థ ఉండె. నేను పక్షితిరిగినట్టు తిరిగి.. కాలికి బట్టకట్టకుండా తిరిగి.. ఘోరమైన కష్టం చేసి ఒకటిన్నర సంవత్సరంలోపు నష్టాన్ని పూడ్చి మరో 14కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చిన.
ఆస్తులు లెక్కపెట్టిరాపో..!
ఎవలయా చెప్పేది.. బుద్ధిండాలా..? ఆర్టీసీకి 60వేల కోట్ల ఆస్తులు ఉన్నయా? చూపెడుతరా? అట్లున్నయని యూనియన్ నాయకులు అంటే ‘ఎక్కుడున్నయ్రా బేవకూఫ్’ అని జర్నలిస్టులు అడగాలె. కానీ.. అర్థం పర్థం లేని ముచ్చట ఏంది? ఎన్ని ఆస్తులున్నయో నువ్వే లెక్కపెట్టిరాపో..(ఆర్టీసీ ఆస్తులపై ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆగ్రహంతో).. బాధ్యత గల జర్నలిస్టువేనే నువ్వు. 60వేల కోట్ల ఆస్తులు ఉన్నయా ఎక్కడైనా.. గిదావయా బుద్ధితక్కువ వ్యవహారం. ఆర్థిక పరిస్థితి బాగోలేకే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం.
వీడొక తొక్కగాడు.. బలుపా?
వీడొక(ఆర్టీసీ జేఏసీ లీడర్) తొక్కగాడు చెప్పిండట అసెంబ్లీ రద్దు చెయ్యాల్నట. వీడావయా.. నాకర్థం కాదు.. ఎవడాడు. గవర్నమెంట్ కూలుతుందా..? ఎవరు కూలుతున్నరో కనపడ్తలేదా ఇప్పుడు? ముఖ్యమంత్రినే తిడుతరా… యూనియన్ల సంస్కారమేనా? ప్రభుత్వాధినేతనే తిట్టి సమస్యలు పరిష్కరించుకోగలరా? అది సమస్యలు పరిష్కారం కావాలనే నైజమా.. రాజకీయ నైజమా..? యూనియన్ నాయకులు ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? తెల్వదా? మేం తింటం.. తిడుతం.. మేమేం జెయ్యం.. అంటే నడువదు. బతకపుట్టిన పిల్ల మంచమంతా ఎగిరినట్టు వీళ్లతీరుంది. బతుకదలుచుకున్నోడైతే చంపుతడా? నీ యూనియన్.. తోక.. ఎక్కడ యూనియన్. సంస్థనే పోతుంటే. వాళ్ల(కార్మికుల) బతుకులు నాశనం చేస్తున్నరు వీళ్లు (యూనియన్లు). ఎవడో పిచ్చోడు బేకార్గాడు చెప్తే కార్మికులు నమ్ముతరా? రోజూ పదకొండు కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్కనపెడుతున్నరంటే.. ఏం బలుపా? ఏందది? తమాషానా? అడ్డంపొడు మాట్లాడుడేనా? కార్మికుల నాయకులే మాట్లాడేదేనా అది. మీ విలువేంది అది. కార్మికుల సంక్షేమం కోరుకునే మాటలేనా అవి. మీ లెక్కేంది మీ పత్రమేంది? ఏమైనా సెన్స్ ఉండాల్నా మాట్లాడటానికి. ఉందా రెస్పాన్సిబిలిటి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నయ్.. మేం ఒకలమే ఉన్నం.. జెండా పట్టుకొని ఉన్నామంటే కాదు కదా? నా స్థాయిలో వాళ్లను (ఆర్టీసీ కార్మికులను) చర్చలకు పిలుస్తనా. పిలువను. ఎండీ ఉన్నడు.. సెక్రటరీ ఉన్నడు.. ట్రాన్స్‌పోర్టు మినిస్టర్ ఉన్నడు.. వాళ్లుచూసుకుంటరు. ఆర్టీసీ కార్మికులు మంచోళ్లే .. ఆర్టీసీ యాజమాన్యంలో ఉన్న అధికారులు కూడా మంచోళ్లే. కానీ.. యూనియన్లదే పంచాయితీ. యూనియన్ల విష కౌగిళ్ల నుంచి కార్మికులు బయటపడాలె.
ఇది తిన్నదరగక జేసే సమ్మె
ఆర్టీసీని మునగొట్టుకుంటున్నది యూనియన్లే. ఏం సమ్మెనండీ ఇది. అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెనా ఇది. దిక్కుమాలిన సమ్మె. ఏం సమ్మె ఇది? తిన్నదరగక జేసే సమ్మెనా? 40ఏండ్ల ఆర్టీసీ సమ్మెలను చూస్తే.. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పుదు.. టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పుదు.. మధ్యల కాంగ్రెస్ వస్తే మళ్లా తప్పుదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పుదు. దీని కారణం ఎందో తెలుసా.. వీళ్లకు(యూనియన్ నేతలకు) రెండు మూడేండ్లకోసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్లు ఉంటయి. యూనియన్ ఎలక్షన్ల ముందర చేసే పనికి మాలిన సమ్మెలివి. అర్థం లేని సమ్మెలివి. తెలివి తక్కువ సమ్మెలివి. యూనియన్ ఎలక్షన్ల కోసం గొంతెమ్మకోర్కెలు పెట్టి.. అలవికాని కోర్కెలు పెట్టి.. దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి.. నాలుగు ఓట్లు రాబట్టుకొనేటువంటి చిల్లరమల్లర యూనియన్ రాజకీయాల సమ్మెలివి.
ఏం చేస్తది హైకోర్టు.. కొడుతదా?
యూనియన్లల్ల ఒకటి సచ్చిపోయిన యూనియన్ ఉంది.. ఎన్ఎంయూ అని. ఆ యూనియన్ వాడేం చేసిండు.. అతితెలివికిపోయి.. కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలియ్యాలని హైకోర్టుల కేసు వేసిండు. ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్లు నటించి.. వీళ్లను కిందమీద దెబ్బకొట్టాల్నని హైకోర్టుల కేసేసిండు. పైసల్ లేవని హైకోర్టుకు ఆర్టీసీ మేనేజ్మెంట్ చెప్పింది. ఏం చేస్తది హైకోర్టు కొడుతదా? ఏ కోర్టయినా ఏం చేస్తది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే జైళ్లేస్తది. డబ్బుల్లేవ్.. డబ్బులు రావ్.. అదే చెప్పింది ఆర్టీసీ మేనేజ్మెంట్. రోజుకు రూ. 11 కోట్లు వచ్చే ఆదాయాన్ని సమ్మెతో ముంచుతున్నరు. ఇదొక పిచ్చి సమ్మె. హైకోర్టుకు ఆర్టీసీ జీతాల విషయంలో తీర్పు చెప్పే పవర్ లేదు. ఏమైతది..? ఆ కేసు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు పోతది. జీతమిస్తవా ఇవ్వవా అని సంస్థను ట్రిబ్యునల్ ప్రశ్నిస్తది. ఆస్తులున్నయి అమ్మి ఇవ్వమంటది. అప్పుడు నాలుగు బస్టాండ్లు అమ్మాల.. ఇవ్వాల. అది సెప్టెంబర్ నెలకు సంబంధించింది. కంపెనీ చట్టం అది. సమ్మె విషయంలో కామన్‌మ్యాన్ ఇంట్రస్ట్‌లో ఒక్కసారి పరిష్కరించాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది తప్ప.. కోర్టుకు ఏ అధికారం లేదని జడ్జి చెప్పిండు.

