మేడిగడ్డపైకి నో ఎంట్రీ!.. లోపలికి మీడియా రాకుండా అడ్డగింత

మేడిగడ్డపైకి నో ఎంట్రీ!.. లోపలికి మీడియా రాకుండా అడ్డగింత

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి /మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎల్​ అండ్​ టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. గేట్లు మూసేసి బ్యారేజీ దగ్గర నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేసింది.  అనుమతి లేని వారికి నో పర్మిషన్‌‌‌‌ అని రాసిపెట్టింది. గత బీఆర్ఎస్  సర్కారు తరహాలోనే మీడియాను రాకుండా అడ్డగిస్తున్నది.   బీఆర్ఎస్​ హయాంలో కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌‌‌‌హౌస్​ గోడ కూలి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు. మేఘా కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ మీడియాను, ప్రజాప్రతినిధులను ఎవరినీ రాకుండా అపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు. ఇప్పుడు  ఎల్‌‌‌‌అండ్‌‌‌‌ టీ కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ కూడా పాత పద్ధతినే అవలంబిస్తోందనే చర్చ జరుగుతున్నది. మేడిగడ్డ బ్యారేజీలో ఇంకా ఎన్ని లోపాలున్నాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్యారేజీ అడుగున భారీ నేల బొయ్యారం

మేడిగడ్డ బ్యారేజీ అడుగున భారీ నేల బొయ్యారం బయటపడింది. శుక్రవారం బ్లాక్‌‌‌‌ 7లో 20, 21వ పియర్స్‌‌‌‌ ఎదురుగా భూమిపై కన్పించిన గుంత సైజ్‌‌‌‌ చాలా తక్కువగా ఉండగా.. శనివారం నాటికి విపరీతంగా పెరిగింది. మీటరున్నర పొడవు, మీటరున్నర వెడల్పు, 6 ఫీట్లకు పైగా లోతున్నట్లుగా కన్పించిన గుంత ఒక రోజు గడిచేసరికి సుమారు వంద మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పునకు పెరిగింది. లోతు ఎంత ఉందో ఎవరికీ తెలియట్లేదు. 7వ బ్లాక్‌‌‌‌లో పియర్స్‌‌‌‌ కింద భూ అంతర్భాగంలో ఇసుక, మట్టి కొట్టుకుపోవడం వల్ల ఈ బొయ్యారం ఏర్పడినట్లుగా గుర్తించిన కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ ఇంజినీర్లు ఆ చుట్టుపక్కలకు ఎవరూ పోకుండా రెడ్‌‌‌‌ రిబ్బన్‌‌‌‌ పెట్టి, డేంజర్‌‌‌‌ జోన్‌‌‌‌గా ప్రకటించారు. అటు వైపు కార్మికులు, ఇంజినీర్లతో పాటు ఎలాంటి వెహికల్స్‌‌‌‌ వెళ్లకుండా ఎర్ర జెండాలు పాతారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందే అలర్ట్​ అయ్యారు. కాగా, గేట్లకు తాళాలు వేయడం వెనుక ఎల్‌‌‌‌అండ్‌‌‌‌ టీ కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థకు ఇరిగేషన్‌‌‌‌ ఇంజినీర్ల సహకారం ఉన్నట్లు చెపుతున్నారు.  

కొట్టుకుపోయిన సీసీ బ్లాక్‌‌‌‌లు, సిమెంట్‌‌‌‌ రాఫ్ట్​

7వ బ్లాక్‌‌‌‌లో పియర్స్‌‌‌‌ కుంగిన ప్రాంతానికి సమీపంలో నేల బొయ్యారం పడిన చోట సిమెంట్‌‌‌‌ రాఫ్ట్​‌‌ గానీ, సీసీ బ్లాక్‌‌‌‌లు గానీ కన్పించట్లేదు. పియర్స్‌‌‌‌కు అనుబంధంగా 4 మీటర్ల డెప్త్‌‌‌‌తో 25 మీటర్ల దూరం వేసిన రాఫ్ట్‌‌‌‌ కనిపించకుండా పోవడం, సీసీ బ్లాక్‌‌‌‌లు వరదకు కొట్టుకుపోవడం, అక్కడ నేలపై ఇసుక, మట్టి కన్పించడం చూసి ప్రమాద తీవ్రత చాలా భారీగా ఉందని సైట్‌‌‌‌ దగ్గర పనిచేస్తున్న ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. కేవలం 2 వేల క్యూసెక్కుల వరద నీటికే గుంతలు బయటపడుతుంటే.. రాబోయే వానాకాలం వరదలకు 7వ బ్లాక్‌‌‌‌ తట్టుకొని నిలబడుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీని కాపాడేందుకు భూ అంతర్భాగంలో వేసిన సీకెంట్‌‌‌‌ ఫైల్స్‌‌‌‌ ఉన్నాయో? లేవో? గుర్తించడానికి టెస్ట్‌‌‌‌లు నిర్వహించాలని నేషనల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ) ఇది వరకే ఆదేశాలిచ్చింది. ఈ టెస్ట్‌‌‌‌లు ఇంకా పూర్తిచేయలేదు. కేవలం తాత్కాలిక మరమ్మతుల కోసం బ్యారేజీ పియర్స్‌‌‌‌ దగ్గర ఇసుక తోడితేనే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉందో బయటపడిందని, అసలైన టెస్ట్‌‌‌‌ రిపోర్ట్స్‌‌‌‌ వస్తే బ్యారేజీ పనికొస్తుందా? రాదా? అన్న విషయం చాలా ఈజీగా తెలిసిపోతుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు.

బొయ్యారం బయటపడడంతో అలర్ట్​

మేడిగడ్డ బ్యారేజీ దగ్గర బొయ్యారం బయటపడిన విషయం శుక్రవారం మీడియాలో ప్రచారం అయ్యింది. దీంతో శనివారం ఉదయమే మీడియాను బ్యారేజీ వైపు రాకుండా అడ్డుకోవడానికి ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ సంస్థ బ్యారేజీ వద్ద గేట్లను మూసేసింది. మొన్నటిదాకా ఇక్కడ పనిచేసిన సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌ను మార్చేసి కొత్త వారిని తీసుకొచ్చి గేట్ల దగ్గర కాపలా పెట్టింది. గేట్లకు తాళాలు వేసి అనుమతి ఉన్నవారికి మాత్రమే పర్మిషన్‌‌‌‌ అంటూ బోర్డు పెట్టింది. దీంతో స్థానిక రైతులు కూడా బ్యారేజీ రోడ్డు దాటి వెళ్లలేకపోయారు. బ్యారేజీకి అవతల వైపు పంట పొలాలు ఉన్న రైతులను సైతం వెళ్లకుండా అడ్డుకున్నారు. గేట్లు మూసేయ డంతో మహారాష్ట్రవాసులు సైతం ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో మీడియా పర్సన్స్‌‌‌‌ బ్యారేజీ దగ్గరికి వెళ్తే అనుమతి లేనిదే లోనికి పంపించబోమని గేట్ల తాళాలు తీయకుండా వెనక్కి పంపించారు.