ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు లేదు : పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు లేదు :   పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పాలన.. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 2వ తేదీ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఫాం ఇస్తుంది కనుక.. కుటుంబానికి ఒక దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు చేసుకోవాలని.. ముందుగా నిర్ణయించినట్లు జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు తేదీ ఉంటుందని.. పొడిగించటం లేదని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ .   అభయ హస్తం కింద దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని.. గడువు ముగిసిన తర్వాత స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 

అందుకు భిన్నంగా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్.. 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని.. గడువు పెంపు లేదని ప్రకటించటం విశేషం. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరిట  కాంగ్రెస్ 5 గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.  లక్షల్లో ధరఖాస్తులు వస్తున్నాయి. ఎక్కువగా పెన్షన్,  ఇళ్లకు ధరఖాస్తులు అందజేస్తున్నారు.