గురుకులాల్లో సౌలతులు కరువు

గురుకులాల్లో సౌలతులు కరువు
  • డార్మిటరీలోనే డైనింగ్​.. అందులోనే క్లాస్​రూంలు
  • ఒక్కో హాల్​లో వంద మందికి పైగా స్టూడెంట్లు
  • కొన్నిట్లో ఆరుబయటే క్లాసులు
  • సరిపడా లేని బాత్రూమ్​లు.. సక్కగ అమలుకాని మెనూ
  • బీసీ, మైనార్టీ గురుకులాలకు ఒక్క సొంత బిల్డింగ్​ లేదు
  • ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అంతంతే 

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. వందల మంది స్టూడెంట్లను ఇరుకు గదుల్లో ఉంచి చదువు చెప్తున్నారు. చాలా గురుకులాల్లో ఇది క్లాస్​రూం, ఇది డార్మిటరీ, ఇది డైనింగ్​హాల్​అని సెపెరేట్​గా లేవు. ఓ హాల్ కేటాయించి అందులో పిల్లల్ని ఉంచుతున్నారు. అక్కడే తినుడు.. అక్కడే చదువుడు.. అక్కడే పండుడు అయితున్నది. దాదాపు 75 శాతం గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేవు. అద్దె బిల్డింగ్స్​లో, ఇరుకిరుకు గదుల్లో వీటిని  నడిపిస్తున్నారు. స్టూడెంట్స్  సంఖ్యకు సరిపడా బాత్రూంలు లేకపోవడంతో కొన్ని చోట్ల రెండు, మూడురోజులకోసారి స్నానం చేస్తున్నారు. వాష్​ రూంలకు డోర్లు లేక రోజుల తరబడి క్లీన్​చేయక, నల్లాలు పనిచేయక,  బకెట్లతో నీళ్లను మోసుకెళ్లలేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గీజర్లు లేక చన్నీటి స్నానాలు చేస్తున్నారు. మెష్​డోర్లు లేక  దోమలతో సావాసం చేస్తున్నారు. చాలా గురుకులాల్లో  మెనూ సరిగ్గా అమలైతలేదు. మొదట్లో ఉన్న సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం బువ్వను పెడ్తున్నారు.  కొన్ని గురుకులాల్లో బెంచీలు లేక నేలమీద కూర్చొని చదువుకుంటుండగా.. ఇంకొన్ని చోట్ల ఆ జాగ కూడా లేక ఆరు బయటే టీచర్లు క్లాసులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సుమారు 30 గురుకులాలను ‘వెలుగు’ టీమ్ గురువారం​విజిట్​ చేసింది. ఈ సందర్భంగా అక్కడి పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు బయటపడ్డాయి.

అద్దె బిల్డింగులే దిక్కు!
రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ , 204 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ఒక్కదానికి కూడా సొంత బిల్డింగు లేదు. 133 ఎస్టీ గురుకులాల్లో 30..  268 ఎస్సీ గురుకులాల్లో 150 గురుకులాలూ అద్దె  బిల్డింగ్స్​లోనే నడుస్తున్నాయి. 665 గురుకులాలకు సొంత బిల్డింగ్స్​ లేవు. అన్ని గురుకులాల్లో కలిపి 4.5 లక్షల మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. రెసిడెన్షియల్​విధానంలో ఇంగ్లిష్​ మీడియం కావడం, ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు పోటీపడి గురుకులాల్లో పిల్లలను చేర్పించారు. చదువు సంగతేమోగానీ సౌలతులు, ఫుడ్ ​​సరిగ్గా లేక పిల్లలు  తిప్పలు పడుతున్నారు. సొంత బిల్డింగులు ఉన్నచోట్ల వసతులు బాగానే ఉన్నప్పటికీ.. అద్దె బిల్డింగుల్లో అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్​ సంఖ్యకు సరిపడా క్లాస్​రూంలు,  డార్మిటరీలు, డైనింగ్​ హాల్స్, వాష్​రూమ్స్ ​లేవు. సరిపడా టీచర్లు ఉండటం లేదు. కొన్ని గురుకులాల్లో టీచర్లు కూడా లేరని స్టూడెంట్స్​ అంటున్నారు. వారంలో నాలుగురోజులు గుడ్డు, రెండురోజులు మటన్ , రెండు రోజులు చికెన్​ పెట్టాల్సి ఉండగా.. వారంలో ఒకరోజు గుడ్డు, ఒకరోజు చికెన్​తో సరిపెడుతున్నారు. ఇదేమని అడిగితే కాంట్రాక్టర్ సప్లై చేయట్లేదని, వస్తే పెడ్తాం.. అని అక్కడి సిబ్బంది చెప్తున్నారు. 

ఏ జిల్లాలో చూసినా.. 

  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్​ బాయ్స్​ గురుకులాన్ని 40 ఏండ్ల కింద కట్టిన ఓల్డ్​ బిల్డింగులో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి ఇంటర్​ వరకు మొత్తం 640 మంది స్టూడెంట్లు ఉండగా.. 200 మంది ఒక డార్మెటరీలో, మిగిలిన వాళ్లు క్లాస్​రూముల్లో పడుకుంటున్నారు. టాయ్​లెట్స్, బాత్రూమ్​లు అధ్వానంగా మారాయి. ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. టాయిలెట్​కు, లెట్రీన్​కు  బయటికే వెళ్తున్నారు.
  • కరీంనగర్  బొమ్మకల్ బైపాస్​లోని కొత్తపల్లి  మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 750 మంది చదువుతుండగా.. సరిపడా రూమ్స్​ల్లేవు. నేలమీదే కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. మెనూ సరిగ్గా ఉండట్లేదని, తినలేకపోతున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇటీవల 50 మంది స్టూడెంట్స్​ జ్వరాల బారిన పడి ఇండ్లకు వెళ్లిపోయారు. 
  • హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్​ స్కూల్​లో 480 మంది స్టూడెంట్స్​ ఉండగా, సరిపడా గదుల్లేక క్లాస్ రూమ్ నే డార్మిటరీగా మార్చుకున్నారు. 
  • హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పీవీ రంగారావు గర్ల్స్​ గురుకులంలో 624 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. బెంచీలు, బెడ్స్  లేవు. ఇటీవల 13 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇండ్లకు పంపించేశారు. 
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారంలో ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్, పర్వతగిరి లో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్,  కాలేజీ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్​లో  628 మంది స్టూడెంట్లు ఉన్నారు. మెనూ ప్రకారం ఫుడ్  పెడ్తలేరు. కాంట్రాక్టర్ సప్లై చేయకపోవడం వల్ల గుడ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రిన్సిపల్ చెప్పారు. 
  • ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురంలోని తెలంగాణ మైనారిటీస్ బాయ్స్  రెసిడెన్షియల్ స్కూల్​లో  డైనింగ్ టేబుల్ గానీ, స్టూడెంట్స్ పడుకునేందుకు బెడ్స్ లేవు.  నేల మీదనే తిని, నేల మీదనే పడుకునే పరిస్థితి ఉంది. మొత్తం 350 మంది స్టూడెంట్స్​కు 11 మంది ఫ్యాకల్టీ  ఉన్నారు. బోనకల్లు,చుంచుపల్లి, కుంచనపల్లి స్కూళ్లలో సరైన సౌలతులు లేక అక్కడి స్టూడెంట్లను కూడా కిష్టాపురం స్కూలులోనే ఉంచారు. 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్​ కిరాయి బిల్డింగ్​లో  నడుస్తున్నది. ఇరుకు గదుల వల్ల స్టూడెంట్లు అవస్థ పడుతున్నారు. వేడినీటి సదుపాయంలేక చలికాలంలో చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. 
  • నాగర్​కర్నూల్​ఉయ్యాల వాడ బీసీ గురుకులంలో 600 మంది స్టూడెంట్స్​ ఉండగా, 300 మంది ఇంటర్​ స్టూడెంట్స్​కు క్లాస్​ రూమ్స్​ లేవు. వీళ్లంతా ఆరు బయట చెట్ల కింద చదువుకుంటున్నారు. రాత్రి క్లాసురూముల్లో నిద్రపోతున్నారు. నల్లమల ఏజెన్సీ ఏరియాలోని అంబట్​పల్లి రెసిడెన్సియల్​ స్కూల్లో 450 మంది స్టూడెంట్స్​కు 8  బాత్ రూమ్​లే ఉన్నాయి. కాంపౌండ్ వాల్​ లేక పోవడంతో  పందులు, పాములు లోపలికి వస్తున్నాయి.  అమ్రాబాద్​ మండలం మన్ననూర్​ రెసిడెన్షియల్​ స్కూల్​లో  642 మంది స్టూడెంట్స్​ ఉండగా.. డార్మిటరీ, క్లాస్ రూమ్​లు శిథిలావస్థకు చేరాయి. అన్నంలో బియ్యం ముక్కి, తెట్టలు కట్టి వాసన వస్తోందని స్టూడెంట్స్​అంటున్నారు.
  • నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో 60 మంది స్టూడెంట్స్ ఉండగా..  4 బాత్రూమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది.
  • మెదక్​ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని మెదక్ టౌన్​లోని ఓ ప్రైవేట్ బిల్డింగ్​లో ఏర్పాటు చేశారు. ఫిఫ్త్ క్లాస్​ నుంచి ఇంటర్ స్టూడెంట్లు 509 మంది ఉన్నారు. ఒక్కో రూమ్​లో 50 మంది ఉంటున్నారు. గదుల కొరత వల్ల పిల్లలు పడుకునే రూమ్​లలోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. భోజనం కూడా అక్కడే చేస్తున్నారు.
  • నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పరిధిలోని శక్కర్ నగర్  సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో 5 నుంచి  టెన్త్​ క్లాస్​ వరకు చదివే 454 పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ గదుల కొరత ఉంది. మోపాల్ మండలం కంజర రెసిడెన్షియల్ స్కూలులో 440 మంది స్టూడెంట్స్ ఉన్నారు.  మూడేండ్ల కింద హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైనా ఇంకా కంప్లీట్ కాలేదు. 
  • కామారెడ్డిలోని  మైనారిటీ బాయ్స్  రెసిడెన్సియల్ స్కూల్​లో 183 మంది స్టూడెంట్స్ ఉన్నారు.  15 ఏండ్లుగా అద్దె బిల్డింగ్​లోనే కొనసాగుతున్నది. సరిపడా బాత్రూమ్స్ లేక.. బయటే స్నానాలు చేస్తున్నారు. వేడినీటి కోసం గీజర్లు ఉన్నా.. వాడటం లేదు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడికి మహత్మా జ్యోతిబా పూలే గర్ల్స్​ గురుకుల స్కూల్  మంజూరైంది. అక్కడ సరైన బిల్డింగ్ అద్దెకు దొరకకపోవడంతో సదాశివనగర్ మండలం కుప్రియాల్ దగ్గర బిల్డింగ్​తీసుకొని నడిపిస్తున్నారు. సరైన సెక్యూరిటీ, పూర్తిస్థాయిలో సౌలతులు లేవు. బీర్కూర్​లోని మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్​లో 550 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అద్దె బిల్డింగ్​లో కనీస వసతులు లేవు. బాత్రూమ్స్, టాయ్​లెట్స్​ సరిపోవడంలేదు.  

అన్నం, కూరలు మంచిగుంటలేవు
అన్నం, కూరలు మంచిగుంట లేవు. చాలాసార్లు సరిగా ఉడకని అన్నం పెడ్తరు. దాన్ని తినబుద్ధికాక ఇబ్బందులు పడుతన్నం. చాలా సార్లు సగం కడుపుకే తింటున్నం. 
- ఆకాశ్​, 8వ తరగతి, మహాత్మా జ్యోతిభా పూలే రెసిడెన్సియల్ స్కూల్​, కౌడిపల్లి, మెదక్​ జిల్లా

బాత్రూంలు తక్కువున్నయి 
మా గురుకులంలో 720 మంది స్టూడెంట్స్​ ఉన్నరు. కానీ కొన్ని బాత్రూంలే ఉన్నయి. ఒక్కో బాత్రూం దగ్గర ఉదయం 20 మంది ఉంటున్నరు. టైమంతా అక్కడ్నే వేస్ట్​ అవుతోంది. డ్రైనేజీ ప్రాబ్లమ్​తో నీళ్లు బయటకు పోక ఇబ్బంది అయితాంది. ఇంకా చాలా సమస్యలున్నయి. -
‑ అంజలి, ఇంటర్మీడియట్​ సెకండియర్​, తుంగతుర్తి ట్రైబల్​ వెల్ఫేర్​ కాలేజ్​, సూర్యాపేట జిల్లా

చాలా ఇబ్బందిగా ఉంది  
సరిపోయేన్ని రూములు లేవు. ​ఒకే రూములో మస్తు మందిమి ఉంటున్నం. రాత్రి కొందరు బెంచీల మీద పండుకుంటే.. కొందరం కింద ఇరుకిరుకుగా పండుకుంటం.  బాత్రూములు కూడా సరిపోయేన్ని లేక తిప్పలైతున్నది. 
- నాగ చైతన్య, 8వ తరగతి, మహాత్మా జ్యోతిభా పూలే రెసిడెన్షియల్​, కౌడిపల్లి, మెదక్​ జిల్లా