కాలువలకు ఫండ్స్​ లేవు.. రిపేర్లు లేవు

కాలువలకు ఫండ్స్​ లేవు.. రిపేర్లు లేవు
  • అధ్వానంగా మూడు జిల్లాల పరిధిలోని 400 కి.మీ. కాలువ

నాగర్​కర్నూల్, వెలుగు: కాల్వల నిర్వహణకు ప్రభుత్వం ఫండ్స్​ఇవ్వకపోవడంతో కేఎల్ఐ పరిధిలోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బలహీనంగా మారిన కాల్వ కట్టలు తెగి ఎక్కడ తమ పంటలు కొట్టుకుపోతాయో అన్న భయంతో వంతులవారీగా కాపలా కాస్తున్నారు. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా రాళ్లు, మట్టి పోసి కట్టలు తెగకుండా రిపేర్లు  చేసుకుంటున్నారు. చేసిన పనులకు డబ్బులు రాలేదని కేఎల్ఐ నిర్వహణ కాంట్రాక్ట్​ ఏజెన్సీలు ఉన్నవాటిని పట్టించుకోవడం మానేశారు. దీంతో నాగర్​కర్నూల్, వనపర్తి, మహబూబ్​నగర్​ మూడు జిల్లాల పరిధిలో 400 కిలోమీటర్ల పొడవున్న కాలువల పరిస్థితి దైవాధీనంగా మారింది. మూడు రిజర్వాయర్ల నుంచి నీటిని డిశ్చార్జి చేసే మెయిన్​కెనాల్స్​లైనింగ్​దెబ్బతిని మట్టితో కూరుకుపోతున్నాయి. మినిమం మెయింటెనెన్స్​గ్రాంట్​కూడా ఇవ్వడం లేదు. ఫీల్డ్​లెవల్​లో రిజర్వాయర్లు, లిఫ్టులు, పంపుహౌజులు, సర్జ్​పూల్, కెనాల్స్​సూపర్​వైజ్​చేయాల్సిన ఎస్ఈ, డీఈ స్థాయి ఇంజనీర్లకు వెహికల్​అలవెన్స్​రాక దాదాపు 9 నెలలు దాటిందని తెలిసింది. ఈ పరిస్థితుల మధ్య కేఎల్ఐ స్కీంలోని లిఫ్టులు, పంప్​హౌజులు, కెనాల్స్​ నిర్వహణ, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. 

అత్తెసరు బడ్జెట్
కేఎల్ఐ కెనాల్స్​ కింద భూములు పోయిన రైతులకు అవార్డు ప్రకటించి టోకెన్​ఇచ్చిన తర్వాత కూడా 29 ప్యాకేజి కింద ఇంకా దాదాపు రూ.19 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాది కాలంగా ఇవి పెండింగ్​లో ఉన్నాయి. 28, 30వ ప్యాకేజీలలో టోకెన్​ ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జొన్నలబొగడ–గుడిపల్లిగట్లు రిజర్వాయర్ల మధ్య అండర్ టన్నెల్​మెయిన్​ కెనాల్​లో దాదాపు 800 మీటర్ల లైనింగ్​పనులు ఏడేళ్లుగా పెండింగ్​లో ఉన్నాయి. కాంట్రాక్ట్​ఏజెన్సీ అధికార పార్టీ నాయకుడిది కావడంతో ఇంజనీర్లు ఒత్తిడి చేయలేక వదిలేశారు. ఇంకా భూ సేకరణ చేస్తూనే ఉన్నారు. కాలువల నిర్మాణం, యూటీలు, బ్రిడ్జిలు, బ్రాంచ్, సబ్, మైనర్​కెనాల్స్​పనులను మధ్యలోనే వదిలేశారు. కేఎల్ఐ కింద చేపట్టాల్సిన పనులు, బకాయిలకు కలిపి బడ్జెట్​లో రూ.50 కోట్లు కేటాయించాలని ఇరిగేషన్​ అధికారులు ప్రపోజ్​చేయగా సర్కార్​రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఏడాది కేంద్ర నిధులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్​కింద కేఎల్ఐ మెయిన్, బ్రాంచ్​కెనాల్స్​రిపేర్లు చేపట్టాలని ప్లాన్​చేసినా కూలీలు రావడం లేదని ఇరిగేషన్​ఆఫీసర్లు ఆరు నెలలు టైం పాస్​చేశారు. దీంతో జిల్లాకు కేటాయించిన ఫండ్స్​వృథాగా పోయాయి.  ​ 

ఆఫీసర్లలో నిర్లిప్తత
నాగర్​కర్నూల్​జిల్లాలోని కేఎల్ఐ లిఫ్ట్​పరిధిలోని మూడు పంప్​హౌజ్​ల నిర్వహణ కాంట్రాక్ట్​ పొందిన సంస్థలకు దాదాపు రూ.30 కోట్ల వరకు బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. పంపులకు కనీసం గ్రీజు రాసేందుకు పైసలు లేవని వాపోతున్నారు. కాంట్రాక్ట్​ఏజెన్సీలకు బకాయిలు, మెయింటెనెన్స్​ఫండ్స్​ఇవ్వకపోవడంతో ఇరిగేషన్​అధికారులు వారిని బతిమిలాడి పనులు చేయిస్తున్నారు.  ఇంతకు ముందు కాల్వలు తెగిపోయాయని సమాచారం వస్తే ఇరిగేషన్​ ఆఫీసర్లు టెన్షన్​పడి ఉరుకులు, పరుగులు పెట్టేవారు. నిధులు రావని వాళ్లకు అర్థం కావడంతో చూద్దాం, చేద్దాం అనేవరకు వచ్చారు. మెయిన్, సబ్​బ్రాంచ్​కెనాల్స్​మట్టి, జనుముతో నిండిపోయినా వాటిని రిపేర్​ చేయించే దిక్కు లేదు. చాలాచోట్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనుము పీకిస్తున్నారు. కాలువలు ఎక్కడికక్కడ తెగి రైతుల పంటలు నీట మునుగుతున్నా ఫండ్స్​రాబట్టడంలో టీఆర్ఎస్​ప్రజాప్రతినిధులు ఫెయిల్​అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.