108, 104 వాహనాల కొనుగోలుకు నిధులు నిల్‌‌

108, 104 వాహనాల కొనుగోలుకు నిధులు నిల్‌‌
  • ఆపద వస్తే అంతేనా..

హైదరాబాద్‌‌, వెలుగు: సమయానికి అంబులెన్స్‌‌ రాకపోవడం, అందుబాటులో లేకపోవడంతో జనం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రాష్ర్టంలో  పెరిగిపోతున్నాయి. 108, 104 వంటి ఎమర్జెన్సీ సర్వీసులను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం, నిధులు కేటాయించకుండా మరింత నిర్లక్ష్యం చేస్తోంది. కొత్త వాహనాలు కొనకపోగా, ఉన్న వాహనాల నిర్వాహణకైనా చాలినన్ని పైసలిస్తలేదు. ఏటికేడు ఈ సర్వీస్‌‌ల నిర్వాహణకు కేటాయిస్తున్న బడ్జెట్‌‌లో కోత పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న 104, 108 వాహనాల్లో వందకుపైగా రిపేర్లకు నోచుకోక షెడ్డుకే పరిమితమయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి కొన్న వాహనాలను నెలల తరబడి రిపేర్ చేయించకపోవడంతో, అవి మరింత పాడైపోతున్నాయి. 50 పాత 108  వాహనాలను మృతదేహాల్ని తరలించేందుకు కేటాయించారు. అందులో 15 వాహనాలకుపైగా రిపేర్లతో మూలకే పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో ఉన్న 2 వాహనాలు రిపేర్‌‌‌‌లో ఉన్నాయి. ఉస్మానియాలో 3 వాహనాలు, గాంధీలో 2 వాహనాలు పరిస్థితీ అంతే.

డీజిల్‌‌కు కూడా చాలట్లే

ఎమర్జెన్సీ సర్వీస్‌‌లకు ప్రభుత్వం కేటాయిస్తున్న డబ్బులు డీజిల్‌‌కు కూడా సరిపోవట్లేదు. రెండు నెలల కిందట డీజిల్‌‌ లేక 108 వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగుల జీతాలకు కేటాయించిన నిధులను డీజిల్‌‌ కోసం వెచ్చించి నడిపించారు. 5 నెలలుగా 104 ఉద్యోగులకు, 3 నెలలుగా 108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. ఈ బడ్జెట్‌‌లోనైనా సరిపడా కేటాయింపులు ఉంటాయోమోనని ఆశిస్తే, గత ఏడాది ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువ కేటాయించారు.

no funds for purchase of 108 and 104 vehicles