- దమ్ముంటే ఆధారాలతో నిరూపించు.. లేకపోతే క్షమాపణ చెప్పు
- మీ ఫ్రీహోల్డ్ జీవోల వెనుకున్న లక్షల కోట్ల మతలబు ఏంటని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తిమ్మిని బమ్మిని చేయడంలో వారిని మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారంటూ ఫైర్అయ్యారు. బీఆర్ఎస్ పదేపదే ప్రస్తావిస్తున్న రూ.5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవమని శనివారం ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. లేదంటే.. మీరు పదే పదే చేస్తున్న ప్రచారం కేవలం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశం అని ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ‘మీరు అధికారం కోల్పోయారనే బాధతో రూ. 5 లక్షల కోట్ల స్కాం అంటూ పాత రికార్డును పదే పదే వాయించే బదులు.. మీరు ఆగస్టు 2023లో తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోల (19, 20, 21) వెనుక ఉన్న లక్షల కోట్ల మతలబు గురించి ముందు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ప్రభుత్వంలో మంత్రిగా సుదీర్ఘ అనుభవమున్న హరీశ్ రావు తమ ప్రభుత్వంపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. పారదర్శకంగా రాష్ట్ర ఖజానాకు రూ. 4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. స్కాంలు చేసి చేసి అలవాటైన బీఆర్ఎస్ నేతలకు మాత్రం అది మింగుడు పడటం లేదన్నారు. వాస్తవాలను దాచిపెట్టి తమ ప్రభుత్వం 9,292 ఎకరాలు అమ్మకానికి పెట్టిందంటూ తమపై దుష్ర్పచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఈ భూముల్లో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసిన ఏరియా లేదా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ కేవలం 4,740 ఎకరాలేనని.. ఇవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములని స్పష్టం చేశారు. మిగిలిన భూములు రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నామని, ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు.
శ్రీధర్ బాబుతో దానం భేటీ
- నేడు స్పీకర్‌ను కలిసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహా చార్యులును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండోసారి నోటీసు పంపించారు. ఈ నెల 23 లోపు దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ఆదివారంతో ఆ గడువు ముగుస్తున్నది. దీంతో దానం నాగేందర్.. స్పీకర్ ను కలిసి మరింత సమయం కావాలని కోరనున్నారని, ఆ తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. దానంతోపాటు నోటీసు అందుకున్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ ను కలిసి అఫిడవిట్ దాఖలుకు మరింత గడువు కోరారు. దానం కూడా కడియం బాటలోనే వెళ్తారా? లేదా? అనే చర్చ నడుస్తున్నది. నాలుగు వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తిచేయాలని ఇటీవలే స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇప్పటికే వారం రోజులు గడిచాయి. మిగిలిన మూడు వారాల్లో స్పీకర్ ఈ కేసును ముగించాల్సి ఉంది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేయగా.. అందులో ఎనిమిది మంది విచారణను స్పీకర్ పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్ చేశారు. ఇక మిగిలింది కడియం, దానం మాత్రమే. ఈ ఇద్దరిలో కడియం మరింత గడువు కోరగా, దానం శనివారం వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనుండగా నేడు దానం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతున్నది.
