రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక... అణచివేసే కుట్ర

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక... అణచివేసే కుట్ర

హనుమకొండ సిటీ, వెలుగు: అక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ కేరాఫ్​ గా మారిందని జనగామ డీసీసీ ప్రెసిడెంట్​, వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్​ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. హనుమకొండలోని తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తనను అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ డీసీసీబీలో రూ.7.99 కోట్ల అవినీతి జరిగిందని, కావాలనే తనపై బురద చల్లే ప్రయత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తాను డీసీసీబీ చైర్మన్​ గా ఉన్నప్పుడు నోరువిప్పని నేతలు, నాలుగేండ్ల తరువాత డీసీసీబీలో అవినీతి జరిగిందంటూ తెరమీదకు తెస్తున్నారన్నారు. తొందర్లోనే ఎలక్షన్స్​రాబోతున్నాయనే తనను కేసులు పాలు చేయాలని టీఆర్ఎస్​ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక కొందరు కాంగ్రెస్​ నేతల హస్తం కూడా ఉందని, వారి గురించి ప్రజలకు తెలుసన్నారు. ఒక రేషన్ డీలరైన ఎర్రబెల్లి దయాకర్ రావుకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భార్య కమీషన్లు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వరంగల్ వెస్ట్​ నుంచి పోటీ చేయాలనుకుంటున్న విషయం పార్టీ  దృష్టికి తీసుకెళ్లానని, అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

పిల్లలకు పురుగుల అన్నమా?

శాయంపేట, వెలుగు: శాయంపేట కేజీబీవీలో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నారని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. శనివారం స్కూల్​ను సందర్శించి, పిల్లలతో మాట్లాడారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, యూనిఫామ్ నేటికీ రాలేదని, ఫ్యాన్లు, కుర్చీలు లేక తిప్పలు పడుతున్నామని స్టూడెంట్లు చెప్పారు. టాయిలెట్లు, డోర్లు సరిగ్గా లేవని వాపోయారు. వంట గదిలోని బియ్యంలో పురుగులు ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆఫీసర్ల పర్యవేక్షణ కూడా లేదన్నారు. కలెక్టర్ స్పందించి, స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం సోనియా గాంధీపై ఈడీ వేధింపులకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపారు.