
- పెద్దపల్లిలో గర్భిణులకు అన్నీ అవస్థలే
- అనుభవం లేని వారితో ప్రసవాలు
- చర్యలు లేవు.. కమిటీలతో కాలయాపన
- ఆందోళనకరంగా పెద్దపల్లి ఆసుపత్రి వైద్యుల తీరు
పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాతా శిశు సంక్షేమ కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారే తప్ప నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో నివాసముండే సౌమ్య డెలివరీ కోసం ఈ నెల 15న పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి ఆశా వర్కర్ సాయంతో వచ్చింది. ఆమెను అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. శిశువు బరువు అధికంగా ఉండడంతో నార్మల్ డెలివరీ సాధ్యం కాదని తెలిసినా డాక్టర్ పట్టించుకోలేదు. దశాబ్దాల క్రితమే మానేసిన పాత పద్ధతి అయిన పోర్సెబ్ డెలివరీ చేసినట్లు బాధితులు చెప్తున్నారు. ఈ పద్ధతి ద్వారా పిండం తలను పట్టకార్లతో పట్టి బయటకు లాగుతారు. ఈ పద్ధతిలో వల్ల శిశువు తల సొట్ట పడి అపస్మారక స్థితిలోకి పోయినట్లు తెలిసింది. దీంతో భయపడిన డాక్టర్, సిబ్బంది శిశువును హుటాహుటిన కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 20న బాబు చనిపోయాడు. సాయంత్రానికల్లా శిశువు చనిపోయిందని తల్లి సౌమ్యకు అప్పగించారు. దీనిపై బాధితురాలి బంధువులతో పాటు పలు సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై మెడికల్ అథారిటీ స్పందించలేదు. ఘటనపై కమిటీ వేశామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలుంటాయని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన గత సంవత్సరం కూడా జరిగింది. చందపల్లికి చెందిన మహిళ పీహెచ్సీలో డెలివరీ అయింది. తర్వాత రోజు రాత్రి ఆమెకు చెస్ట్‌లో నొప్పి రావడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో చికిత్స ఆలస్యమై ఆ బాలింత చనిపోయింది. ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోగా, అనుభవం లేని వారితోనే ఇంకా ప్రయోగాలు చేయిస్తున్నారు.
ఆశా వర్కర్లను కేర్ చేయని డాక్టర్లు..
ఆశాలు, ఏఎన్ఎంలు గ్రామాల్లో తిరుగుతూ గర్భిణుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. నిత్యం వారికి అందుబాటులో ఉంటూ తొమ్మిది నెలలు డాక్టర్ల సూచనలు పాటించేలా గర్భిణులకు తోడుగా ఉంటున్నారు. గర్భిణుల సమస్యలు డాక్టర్ల దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తే తమపై డాక్టర్లు కేర్లెస్గా మాట్లాడుతున్నారని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే కాకుండా పీహెచ్‌సీల్లో కూడా ప్రసవాలు జరిగేలా చూడాలని కోరుతూ ప్రభుత్వం డాక్టర్లకు టార్గెట్ పెట్టింది. దీంతో పీహెచ్సీ డాక్టర్లు నార్మల్ డెలివరీలు తమ పీహెచ్‌సీలోనే జరిపిస్తున్నారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ఆశా వర్కర్లే ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ వివిధ రకాల పరీక్షలు దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ క్రమంలో పీహెచ్‌సీల్లో లేని పరీక్షల కోసం ప్రధాన ఆసుపత్రులకు గర్భిణులను ఆశాలు, ఏఎన్ఎంలు తీసుకొస్తే ప్రధాన ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఉదయం 9.30 గంటలు దాటితే పరీక్షలు చేసేదే లేదని చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు.
అనుభవం లేని గైనకాలజిస్టులతో..
అనుభవం లేని గైనకాలజిస్టులతో పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో ప్రయోగాలు చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఇద్దరే గైనకాలజిస్టులున్నారు. వీరు కూడా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు. ఒకరు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యసేవలందిస్తున్నట్లు సమాచారం. మరొకరు ఉన్నా అనుభవం లేకపోవడంతో కేసులు తిరుగబడి పేషెంట్లు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో మరో ముగ్గురు గైనకాలజిస్టులున్నా ఒకరు మానేశారు. మరో ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది. ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లే మిగిలారు. దీంతో ప్రధాన ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చే గర్భిణులను స్టాఫ్ నర్సులే పరీక్షలు చేసి పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఆసుపత్రి అయినప్పటికీ సరిపడా డాక్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. జిల్లా ఆసుపత్రిలో ఐదుగురు గైనాకాలజిస్టుల అవసరం ఉంది. అయినప్పటికీ ఇద్దరితోనే నడిపిస్తున్నారు. జూన్‌లో ఒక్క గైనకాలజిస్టుతోనే నెట్టుకొచ్చారు. ఆ ఒక్క డాక్టర్ కూడా పార్ట్ టైంగా వచ్చిపోయారు. అనుభవం ఉన్న డాక్టర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆశా వర్కర్ చెప్పినా పట్టించుకోలే
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అనుభవం లేని డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇటీవల డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మా తమ్ముడి కొడుకు పురిట్లోనే చనిపోయిండు. బాబు బరువు ఎక్కువగా ఉన్నాడు. ఆపరేషన్ చేయాలని ఆశా వర్కర్ చెప్పినా డాక్టర్ పట్టించుకోకుండా నార్మల్కు ట్రై చేసింది. పాత పద్ధతిలో చేయడం వల్ల బాబు బ్రెయిన్ డెడ్ అయ్యాడు.
- తిరుపతి, బాధితురాలి బావ
కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు
బాబు చనిపోయిన ఘటనపై కమిటీ వేశాం. రిపోర్ట్ ప్రకారం డాక్టర్‌పై చర్యలుంటాయి. ఆసుపత్రిలో ఐదుగురు గైనకాలజిస్టులు ఉండాలి. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. డాక్టర్ల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తొందరలోనే పూర్తిస్థాయిలో డాక్టర్ల నియామకం జరుగుతుంది.
- డాక్టర్ వాసుదేవారెడ్డి, సూపరింటెండెంట్, పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రి