జ్ఞానవాపి పూజలు ఆపాలని చెప్పలేం : అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి పూజలు ఆపాలని చెప్పలేం :  అలహాబాద్ హైకోర్టు

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు సౌత్ సెల్లార్‌‌‌‌‌‌‌‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పూజలు ఆపేయాలని ఆదేశాలివ్వలేమని హైకోర్టు పేర్కొంది.  జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌తో కూడిన సింగిల్ బెంచ్ మసీదు ప్రాంగణం లోపల, బయట పోలీసులను మోహరించాలని అడ్వకేట్ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది. దీంతో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్​బీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. 

జిల్లా వ్యాప్తంగా బలగాల మోహరింపు

కోర్టు ఆదేశాల తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం నమాజ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా వారణాసి జిల్లాలో హై అలర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. కాగా, వారాణాసి కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ శుక్రవారం బంద్‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చింది. అయినా.. నమాజ్​తో పాటు పూజలు యథావిధిగా కొనసాగాయి.