సెలవు ఏమీ లేదు.. వచ్చి పని చేయండి : తేల్చి చెప్పిన కర్ణాటక సీఎం

సెలవు ఏమీ లేదు.. వచ్చి పని చేయండి : తేల్చి చెప్పిన కర్ణాటక సీఎం

ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి పెంచినప్పటికీ.. అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న సెలవు ప్రకటించకూడదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం అమ్మకాలను నిషేధించిన అనేక రాష్ట్రాలలాగా డ్రై డేని కూడా ప్రకటించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తాము సెలవు ప్రకటించమని, మహదేవపుర నియోజకవర్గంలో [బెంగళూరులో] కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని తాను ప్రారంభిస్తానని చెప్పారు. వారు తనను ఆహ్వానించారని, కావున తాను వెళ్ళేందుకు సిద్ధమవుతున్నానన్నారు.

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. తాము మతాన్ని ప్రచారం కోసం ఉపయోగించమన్న ఆయన.. ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతున్నామని చెప్పారు. ఎవరూ అడగకముందే తాము అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలను ఆదేశించామని తెలిపారు. మనం చాలా కాలంగా మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తున్నామని, మనకు ఇతరుల నుండి మతం, భక్తి గురించి ఉపన్యాసాలు అవసరం లేదన్నారు. సిద్ధరామయ్య పేరులో రాముడు, తన పేరులో శివుడు ఉన్నాడని చెప్పారు. మన ఆచారాలు, సంప్రదాయాలేంటో తమకు తెలుసన్న శివ కుమార్.. రాజకీయాల్లో ధర్మం ఉండాలి కానీ ధర్మంలో రాజకీయాలు ఉండకూడదని హితవు చేశారు. సెలవు ప్రకటించాలని బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు.

ప్రజలు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను వీక్షించేందుకు, జరుపుకునేందుకు వీలుగా కేంద్రం అన్ని కార్యాలయాలు, సంస్థలను సగం రోజు మూసివేయడానికి తీసుకున్న చర్యను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక.. సిద్ధరామయ్యకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు పూర్తి రోజు సెలవు ప్రకటించాలని అశోక.. సీఎంను కోరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కేంద్రాన్ని అనుకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.