గిరిజనులకు రెండేండ్లయినా ఇండ్లు కట్టించలేదు

గిరిజనులకు రెండేండ్లయినా ఇండ్లు కట్టించలేదు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొలాంగోంది గిరిజనులకు పునరావాసం కల్పించడంలో గవర్నమెంట్ తీవ్ర జాప్యం చేస్తోంది. ఫారెస్ట్​ ఆఫీసర్లు ఇండ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన  కొలాంగోంది 16 గిరిజన కుటుంబాలకు ఏడాదిలోపు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రెండేండ్లు అవుతున్నా నేటికీ వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వలేదు. కరెంటు సౌలత్ లేక అంధకారంలోనే గిరిజనులు మగ్గుతున్నారు. 2019 జూన్ 12.. కాగజ్ నగర్ మండలం కోలాంగోంది గ్రామంలో అటవీ భూమిలో కట్టుకున్నారంటూ గిరిజనుల గుడిసెలను, ఇండ్లను ఫారెస్ట్ ఆఫీసర్లు కూల్చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ఊరును ఖాళీ చేయించారు. 16 కుటుంబాలను తీసుకెళ్లి వేంపల్లి టింబర్ డిపోలో పెట్టారు. దీనిపై ఆదివాసీ, ప్రజాసంఘాలు, పౌర హక్కుల వేదిక నాయకులు ఆందోళన చేశారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2019 జూన్ 16 న దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొలాంగోంది గిరిజనులను అడవి నుంచి తరలించి ఎలాంటి సౌకర్యాలు లేని టింబర్ డిపోలో ఉంచడంపై మండిపడింది. 67 మంది గిరిజనులకు 91 ఎకరాల భూమిని ఆరు నెలల్లో ఇవ్వాలని, ఆ భూమికి ఇరిగేషన్​సౌకర్యం కల్పించాలని, ఏడాదిలోగా పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, జీవనోపాధి కోసం పశువులను అందజేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆఫీసర్లు గిరిజనులను టింబర్​డిపో నుంచి వాంకిడిలోని బీసీ హాస్టల్ కు తరలించారు.అనంతరం ప్రభుత్వం ఆసిఫాబాద్ సమీపంలోని సాలేగూడ సమీపంలోని పట్టు పరిశ్రమ ఆవరణలో రెండున్నర ఎకరాల స్థలం కేటాయించింది. వీళ్లు అక్కడకు వెళ్లి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. హైకోర్టు ఆదేశించి రెండేండ్లు దగ్గర పడుతున్నా నేటికీ పక్కా ఇండ్లూ కట్టించలేదు. భూములు ఇచ్చినప్పటికీ ఇరిగేషన్​కు సౌలతులు మాత్రం కల్పించలేదు. 

వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ..

ఇక్కడి గిరిజనుల్లో ఏడుగురికి రేషన్ కార్డులు లేక గవర్నమెంట్ ఇచ్చే రాయితీ బియ్యం అందడం లేదు. పట్టుపరిశ్రమ ఆవరణలో స్థలం చూపించడంతో అక్కడే గుడిసెలు వేసుకుని వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవన పోరాటం చేస్తున్నారు. పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించేవరకు సకల సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకునేవారే కరువయ్యారు. కరెంటు సౌకర్యం లేక గిరిజనులు అంధకారంలో బతుకుతున్నారు. రాత్రి పూట ఇంట్లోకి తేళ్లు, పాములు వస్తున్నాయని వాపోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన భూములు సాగులోకి రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందని, ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కూలి పనులు దొరక్క, ఉపాధి లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా కేవలం ఒక చిన్న పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. నీళ్లు సరిగ్గా రావడం లేదని, సమీపంలోని వాగు నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు.

పునాదులు తవ్వి వదిలేశారు

ఆసిఫాబాద్ మండలం సాలేగూడ సమీపంలో కొలాంగోంది 16 గిరిజన కుటుంబాల కోసం గవర్నమెంట్ మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్ 10న జడ్పీ చైర్​పర్సన్​కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా భూమి పూజ చేశారు. తమకు గూడు వస్తుందని ఆశించిన గిరిజనులకు నిరాశే మిగిలింది. తవ్వి వదిలేయడంతో పునాదుల్లో మళ్లీ మట్టి పూడుకుపోయింది. వర్షాకాలం రాకముందే పక్క గృహాలు పూర్తి చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.